విశాఖలో పవన్ మకాం.. ఏం చేస్తారు..!
వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా సీట్లు కావాలని కోరుతున్న నేపథ్యంలో పవన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
By: Tupaki Desk | 20 Feb 2024 9:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారం రోజుల షెడ్యూల్ పెట్టుకుని మరీ విశాఖకు చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా సీట్లు కావాలని కోరుతున్న నేపథ్యంలో పవన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరాంధ్రలోని ఓ కీలక నియోజక వర్గం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును బరిలోకి దించనున్నారు. ఈయన ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో వారం రోజు లుగా తిష్ఠవేసి మరీ పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఇంకోవైపు.. మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలకు తోడు ఇప్పుడు పవన్ రాకతో విశాఖ సహా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త ఊపు వస్తుందా? అనేది చూడాలి.
ఉత్తరాంధ్రలో జనసేనలో చేరిక పెరగనున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కీలక నేతగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ పార్టీ మారి.. జనసేన గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పులో పనిచేస్తానని చెప్పారు. అదేవిధంగా రేపో మాపో కొణతాల రామకృ ష్ణ కూడా చేరికకు రెడీ అయ్యారు. వీరితో పాటు.. తాజా పర్యటనలో మేధావులను పవన్ కలవనున్నారు. ఆంద్ర యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలతోనూ పవన్ భేటీ కానున్నట్టు తెలిసింది.
మేధావులు, విద్యార్థులను చైతన్యం చేయడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, సీట్ల విషయానికి వస్తే.. అనకాపల్లి ఎంపీసీటు కోసం జనసేన పట్టుబడుతోంది. అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం లేదా.. దక్షిణ నియోజకవర్గాలను కోరుతోంది. మొత్తంగా నగరం పరిధిలో ఒక సీటుతో పాటు.. జిల్లా పరిధిలోని చోడవరం, యలమంచిలి స్థానాలను కూడా కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇతమిత్థంగా టీడీపీ నుంచి ఎలాంటి హామీ రాలేదని తెలిసింది.
శ్రీకాకుళంలో ఈ సారి రాజాం టికెట్‌ను జనసేన ఆశిస్తోంది. అదేవిధంగా పాలకొండ ఎస్టీ సీటును కూడా టీడీపీ కోరుతోంది. ముఖ్యమైన శ్రీకాకుళం నియోజకవర్గంపై పవన్ కు అవగాహన ఉండడం.. టీడీపీ తరఫున ఇక్కడ గుండ లక్ష్మీదేవి ఉన్నప్పటికీ.. ఈ దఫా జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన ఆశిస్తున్న టికెట్ల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకు లు. ఇక, విజయనగరంలో బొబ్బిలి, పాతపట్నం సీట్లను కూడా జనసేన కోరుతోంది.
రణస్థలంలో నిర్వహించిన వారాహి సభలో గత ఏడాది ఉత్తరాంధ్ర గడ్డకు జనసేన న్యాయం చేస్తుందని ప్రకటించిన దరిమిలా.. రెండు సార్లు పవన్ ఇక్కడ పర్యటించారు. అంటే మొదటి నుంచి కూడా పవన్ ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అదేవిదంగా వచ్చే ఎన్నికల్లో మొత్తం 6 నుంచి 8 సీట్లు ఉత్తరాంధ్ర నుంచే పవన్ ఆశిస్తున్న నేపథ్యంలో విశాఖ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయా నేతల పనితీరు.. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే విషయం తేలిపోనుందని అంటున్నారు. ఎన్నికలకు ముందు.. విశాఖలో పర్యటించడం.. ఇదే చివరి సారి కావొచ్చనితర్వాత నేరుగా ప్రచారంలోకి దిగే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు.