పవన్ కల్యాణ్ తీరుకు భిన్నంగా ఇప్పుడెందుకు?
జనసేనానికి ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం పవర్ స్టార్ అని పిలుచుకునేందుకు ఇష్టపడుతుంటారు.
By: Tupaki Desk | 16 Aug 2024 8:30 AM GMTజనసేనానికి ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం పవర్ స్టార్ అని పిలుచుకునేందుకు ఇష్టపడుతుంటారు. సినీ స్టార్ గా ఆయనకున్న ఇమేజ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న అభిమానులకు కొదవ ఉండదు. సినీ స్టార్ గా ఆయనకున్న ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా పొలిటికల్ ఇమేజ్ ను పెంచుకోవటంలో కోసం చాలానే కష్టపడ్డారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. కొన్ని నెలల క్రితం వరకు జీరోగా పవన్ గురించి చెప్పిన రాజకీయ ప్రత్యర్థులు.. ఇప్పుడాయన పేరును పలకటానికి సైతం జంకుతున్న దుస్థితి. అంతలా ఆయన గ్రాఫ్ పెరిగింది.
గెలుపు తీసుకొచ్చే ధీమా ఒకలా ఉంటే.. ఓటమి తెచ్చే నైరాశ్యం మరోలా ఉంటుంది. అందరూ ధీమాను చూశాక నైరాశ్యాన్ని చూస్తారు. అంతులేని ప్రజాభిమానం ఉన్నప్పటికీ పొలిటికల్ గా మాత్రం మొదట నైరాశ్యం చూసిన తర్వాతే పవన్ కు ధీమా పరిచయమైంది. సినీ స్టార్ గా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన పవన్.. రాజకీయంగానూ అంతే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే.. పవర్ స్టార్ గా ఉన్న ఆయనకు.. జనసేనానికి ఉన్న ఆయనకు మధ్య తేడా ఈ మధ్య కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఎప్పుడూ తన పిల్లల్ని తెర మీదకు తీసుకురావటానికి పెద్దగా ఆసక్తి చూపని పవన్ కల్యాణ్.. అందుకు భిన్నంగా ఇప్పుడు తన పిల్లల్ని ఒక్కొక్కరిగా పబ్లిక్ స్పేస్ లోకి తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అకీరా నందన్ పవన్ వెంటే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తన కొడుకును తీసుకెళ్లాడు. పవన్ వెంటే ఉన్న అకీరా స్పెషల్ అట్రాక్షన్ గా మారటం తెలిసిందే.
సుదీర్ఘ సినీ జీవితంలో ఏ ఫంక్షన్ కు.. మరే వేడుకకు కొడుకును.. కూతుర్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చే అలవాటు లేని పవన్ కల్యాణ్.. అందుకు భిన్నంగా పొలిటికల్ స్టార్ గా మారిన తర్వాత మాత్రం కొడుకును తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. కొందరు అనుకోకుండా జరిగిన పరిణామంగా పేర్కొంటే.. మరికొందరు మాత్రం వ్యూహంలో భాగంగానే జరిగిందన్న మాటను చెప్పారు. ఈ రెండు వాదనల్లో నిజం ఏమిటన్నది రాబోయే రోజులు తేలుస్తాయి. ఇదిలా ఉంటే పంద్రాగస్టు వేడుకలకు తనతో పాటు తన కుమార్తె ఆద్యను తీసుకెళ్లటం ఆసక్తికరంగా మారింది.
మొన్నటికి మొన్న కొడుకు.. ఈసారి కుమార్తెను పబ్లిక్ వేదికలకు తీసుకురావటాన్ని ప్రస్తావిస్తూ.. పవన్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందంటున్నారు. తన పిల్లలకు వ్యవస్థలు ఎలా ఉంటాయి? అవెలా పని చేస్తాయన్న అంశంపై అవగాహన కోసం వారిని తీసుకొస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో తనకు తన పిల్లలకు మధ్యనున్న అన్యోన్యత గురించి చెప్పకనే చెప్పినట్లు ఉంటుందని చెబుతున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని.. వారికి అనుగుణంగా వ్యవహరించే గుణం పవన్ కు లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
సినీ నటుడిగా పిల్లల్ని సినిమా ఫంక్షన్లకు తీసుకురాని పవన్.. పొలిటికల్ వేదికల మీదకు తీసుకురావటం రోటీన్ కు భిన్నంగా ఉందంటున్నారు. ఈ తీరును ఒకట్రెండు సార్లకు పరిమితం చేస్తారా? తరచూ వారిని తీసుకొస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తానికి పవన్ లో కొత్త తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.