మనించారా? ఎగ్జిట్ హడావుడిలోనూ పవన్ జాడ కనిపించట్లేదు!
అంతలా అందరిని ప్రభావితం చేసిన ఎన్నికల ఫలితాలు మరో రోజులో విడుదల కానున్నాయి.
By: Tupaki Desk | 3 Jun 2024 4:23 AM GMTఏ ఇద్దరు కలిసినా ఎగ్జిట్ పోల్స్ చర్చనే. ఇక.. తెలుగు వారు కలిస్తే వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావొచ్చు. మాట్లాడుకునేది మాత్రం ఎన్నికల ఫలితాల గురించే. ఆ మాటకు వస్తే.. అప్పటివరకు అపరిచితులుగా ప్రయాణిస్తున్న తెలుగువారు.. షాపింగ్ వేళ.. బిల్లింగ్ కౌంటర్ వద్ద కూడా ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంతలా అందరిని ప్రభావితం చేసిన ఎన్నికల ఫలితాలు మరో రోజులో విడుదల కానున్నాయి.
రాజకీయ క్రీడను చూస్తున్న ప్రజలే ఇంతలా ఉంటే.. రాజకీయ నేతలు మరెంత టెన్షన్ తో ఉన్నారన్న విషయం వారి ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. ఇంత హడావుడిలోనూ కామ్ గా.. ఎవరికి అందుబాటులోకి రాకుండా.. తనదైన ప్రపంచంలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల వేళ దూకుడు ప్రచారంతో పాటు.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనంత కష్టాన్నిపడిన ఆయన.. ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని తెలిసిందే.
అయితే.. ఏం మాట్లాడినా.. ఏం స్పందించినా కూడా ఫలితాల మీద క్లారిటీ వచ్చిన తర్వాతే తప్పించి.. అంతకు ముందు వరకు కామ్ గా ఉండాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో పార్టీ నేతలతో భేటీ కావటం.. ఫలితాల అంచనా విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ విపక్ష నేత చంద్రబాబు కానీ స్పందిస్తున్నారు. కానీ.. అందుకు భిన్నంగా మౌనంగా ఉంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.
ఎగ్జిట్ ఫలితాలు మొత్తం తమకే అనుకూలంగా ఉన్నట్లుగా చంద్రబాబు తన క్యాడర్ కు చెప్పటం.. జూమ్ కాల్ లో తాము అధికారంలోకి వచ్చేస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఓట్ల లెక్కింపు వేళ.. క్యాడర్ లో జోష్ పెంచేందుకు ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్ కు బోలెడన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితే అధికార పార్టీలోనూ ఉంది. కాకుంటే.. నేరుగా సీన్లోకి రాని జగన్మోహన్ రెడ్డి.. తనకు అత్యంత సన్నిహితుడు కం ఏపీ రాష్ట్ర సలహాదారు అయిన సజ్జల చేత చేయించాల్సిన పనుల్ని చేయిస్తున్నారు. వీరికి భిన్నంగా జనసేనాని పవన్ మాత్రం తనదైన ప్రపంచంలో.. తుది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతటి మౌనం ఒక రాజకీయ పార్టీ అధినేతకు ఉండటం మాత్రం అరుదైన అంశంగా చెప్పకతప్పదు.