బీజేపీ జనసేన కూటమి సీఎం అభ్యర్ధిగా పవన్...?
ఏపీలో బీజేపీ జనసేన కలసి 2024లో పోటీ చేయాలని ఆ విధంగా రెండు పార్టీలు ఇక మీదట ఉమ్మడి పోరాటాలు చేయాలని బీజేపీ దిశానిర్దేశం చేయనుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 16 July 2023 11:24 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ లో రాజకీయ లాభం ఎంత అన్నది ఇపుడు చర్చ సాగుతోంది. బీజేపీతో పొత్తు. ఎన్డీయే భాగస్వాములతో మీటింగ్. పవన్ కి ఆహ్వానం అంటే ఆయనకు ఏపీలో వైసీపీ టీడీపీలకు ధీటుగా హోదా దక్కినట్లే అంటున్నారు. పవన్ సైతం ఎన్డీయే మీటింగ్ కి వెళ్లేందుకు ఉత్సాహపడుతున్నారు. ఒక రోజు ముందుగానే ఆయన ఢిల్లీ చేరుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మీటింగ్ ద్వారా పవన్ కి బీజేపీ పెద్దలు కచ్చితమైన సందేశం అయితే అందిస్తారు అని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదగాలి. అలాగే మిత్రపక్షంగా జనసేన ఎదగాలి. ఇదే బీజేపీ కేంద్ర పెద్దలు పవన్ ఇచ్చే సందేశం అని అంటున్నారు. పవన్ రాజకీయ పరిభాషలో రోడ్ మ్యాప్ అని కూడా దీన్ని పేర్కొంటారు అంటున్నారు.
ఏపీలో బీజేపీ జనసేన కలసి 2024లో పోటీ చేయాలని ఆ విధంగా రెండు పార్టీలు ఇక మీదట ఉమ్మడి పోరాటాలు చేయాలని బీజేపీ దిశానిర్దేశం చేయనుంది అని అంటున్నారు. ఏపీలో టీడీపీ దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ కి బీజేపీ జనసేన తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ పెద్దల ఆదేశం, అభిలాష కూడా.
ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవే వైసీపీ టీడీపీ. ఒక పార్టీ మీద జనాలకు విసుగు పుడితే రెండవ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఈ గుడుగుడు గుంచం రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నదే బీజేపీ ఆలోచన అని అంటున్నారు రెండు పార్టీలలో ఒక రాజకీయ పార్టీని పూర్తిగా పొలిటికల్ తెర మీద నుంచి తప్పిస్తేనే ఏపీలో రాజకీయ శూన్యత ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. ఆ దిశగానే చర్యలకు దిగుతోంది. యాక్షన్ ప్లాన్ ని కూడా అదే తీరున రూపొందిస్తోంది.
ఏపీలో వైసీపీ ఓటు బ్యాంక్ ప్రత్యేకంగా ఉంది. మైనారిటీస్, దళిత్స్, గిరిజనులు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. దాంతో వైసీపీ రేపటి రోజున వైసీపీ ఓట్లు బీజేపీ జనసేనలకు ఎంతమాత్రం షిఫ్ట్ కావు అన్నది బీజేపీ భావన. అదే టైంలో టీడీపీకి అండగా ఉనన్ అగ్ర వర్ణాలు, కమ్మలు, బీసీలు, కాపులు ఓట్లు మాత్రం చాలా సులభంగా బీజేపీ సేన కూటమి వైపు షిఫ్ట్ అవుతాయని కాషాయ దళం అంచనా కడుతోంది.
ఈ ఓట్లు ఇపుడు టీడీపీ వైపు ఉన్నాయి. అయితే కాపులు జనసేన వైపు నెమ్మదిగా షిఫ్ట్ అవుతున్నారు. అగ్ర వర్ణాలు బీజేపీ అంటే ఇష్టపడుతున్నా రాజకీయంగా ఆ పార్టీ ముందుకు రాలేకపోతోంది అన్న కారణం చేతనే టీడీపీకి ఓటు వేస్తున్నారు. ఇక కమ్మలు కూడా బీజేపీ పట్ల ఫావర్ గా ఉంటూనే ఫస్ట్ ప్రయారిటీగా టీడీపీని ఎంచుకుంటున్నారు. దాంతో ఇపుడు టీడీపీ ఓట్ల కోటను బద్ధలు కొట్టాలని వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ జనసేన కూటమి తాము బలపడుతూ టీడీపీకి దెబ్బేయాలన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.
ఈ విషయాలనే పవన్ కి కేంద్ర పెద్దలు వివరిస్తారు అని అంటున్నారు. అదే విధంగా పవన్ని కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా ప్రకటించి ఆయనకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఏపీలో కూటమిని నడపాలని కోరుతారు అని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పట్టుదలగా ఉన్న పవన్ బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ పట్ల ఎంతవరకూ హర్షిస్తారు ఆమోదిస్తారు అన్నదే చర్చకు వస్తోంది.
అదే విధంగా చూస్తే తెలుగుదేశంతో కలసి పొత్తులకు వెళ్లాలని, తనతో పాటు బీజేపీని కూడా కలుపుకుని పోవాలని పవన్ ప్లాన్ గా ఉంది అని చెబుతున్నారు. మరి ఢిల్లీ వెళ్తునన్ పవన్ తన వాదన కేంద్ర పెద్దల వద్ద వినిపించి 2014 నాటి పొత్తులను ఖరారు చేయించుకుంటారా లేక బీజేపీ రోడ్ మ్యాప్ కి అంగీకరించి కూటమి తరఫున సీఎం అభ్యర్ధిగా తిరిగి వస్తారా అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.