Begin typing your search above and press return to search.

అందరి దృష్టి పవన్ మీదేనా ?

ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు కాబట్టే.

By:  Tupaki Desk   |   20 July 2023 4:48 AM GMT
అందరి దృష్టి పవన్ మీదేనా ?
X

అందరి దృష్టి ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాన్ మీదే ఉంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు కాబట్టే. బుధవారం రాత్రి సుమారు అర్ధగంటపాటు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అమిత్ షా తో భేటీ అంటేనే ఏపీ రాజకీయాల గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కూడా రెండు పాయింట్లే ప్రధాన అజెండాగా ఉంటుంది. మొదటిది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంటుంది. రెండోది టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశమని అందరికీ తెలిసిందే.

నిజానికి రెండు అంశాలను పవన్ ప్రస్తావించగలరే కానీ అమిత్ ను ప్రభావితం చేయలేరు. ఎందుకంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది నరేంద్రమోడీ మాత్రమే. మోడీ నిర్ణయాన్ని అమిత్ అమలు చేయగలరంతే.

ఇపుడు జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే జగన్ పై పవన్ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే ఎన్డీయేకి ఏ విషయంలో అయినా జగన్ నమ్మకమైన వెలుపలి మద్దతుదారుడుగా ఉన్నారు.

కాబట్టి ఇంతటి నమ్మకమైన మద్దతుదారుడిని మోడీ వదులుకోలేరు. ఎందుకంటే రాజ్యసభలో బిల్లుల ఆమోదంలో జగన్ మద్దతు చాలా అవసరం. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు విషయాన్ని కూడా ప్రస్తావించగలరే కానీ పొత్తుపెట్టుకునేట్లు ఒప్పించేంత సీన్ పవన్ కు లేదు. ఎందుకంటే జనసేనకు ఉన్న బలమే సున్నా. అందుకనే ఎన్నిసార్లు కలిసినా పవన్ కన్వీన్సింగుగా మాట్లాడగలరంతే.

ఇదే విషయంలో బీజేపీతో పొత్తు వద్దని తమ్ముళ్ళలో చాలామంది చంద్రబాబు నాయుడుకు పదేపదే చెబుతున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకున్న మైనస్సంతా టీడీపీ మీద కూడా పడుతుందని భయపడుతున్నారు. తమ్ముళ్ళ వాదనతో చంద్రబాబు ఏకీభవించారు. అందుకనే బీజేపీతో పొత్తు విషయంలో ఇంతకుముందున్నంత ఆతృత చంద్రబాబులో ఇపుడు కనబడటం లేదు.

ఒకవేళ గతంలో చేసిన ప్రయత్నాల కారణంగా బీజేపీ తనంతట తానుగానీ లేదా పవన్ రాయబారం వల్లగానీ పొత్తుకు రెడీ అయితే అప్పుడు ఏమిచేయాలో చంద్రబాబు డిసైడ్ చేస్తారు. అందుకనే పవన్ తాజా రాయబారం ఏమైందనే ఆసక్తి అందరిలోను పెరిగిపోతోంది.