పవన్ సంతకాల హామీలు ఏమైనట్టు..?
పైగా.. వచ్చే ఎన్నికల్లో సీఎం కావాలని ఒకసారి.. తనకంటే సీనియర్లున్నారని మరోసారి..ఇలా అనేక ప్రకటనలు చేశారు.
By: Tupaki Desk | 28 July 2023 7:22 AM GMTఔను.. ఎన్నికలకు ముందు నాయకులు చేసే ప్రకటనలు తరచుగా తెరమీదికి వస్తాయి. ప్రత్యర్థులైనా.. ఇతరులైనా.. కొన్నికొన్ని సందర్భాల్లో సొంత నేతలైనా.. కూడా గతాన్ని తవ్వుతారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తెరమీదికి వస్తున్నాయి. తాను అధికారంలోకి రాగానే.. అంటూ.. పవన్ అనంతపురంలో కౌలు రుతు కుటుంబం పరామర్శకు వెళ్లినప్పుడు ఆసక్తికర ప్రకటనలు చేశారు.
అయితే.. ఆయా ప్రకటనలను పవన్ మరిచిపోయి ఉండొచ్చు. కానీ, జనసైనికులు మాత్రం గుర్తు పెట్టుకు న్నారు. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం.. సుగాలి ప్రీతి కుటుంబానికి సంబంధించిన అంశం పై పెడతామని.. ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని పవన్ చెప్పారు. రెండో సంతకం.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మూడో సంతకం రైతులకు మేలు చేసేందుకు పెడతామని పవన్ వెల్లడించారు. కానీ, తర్వాత ఆయన వదిలేశారు.
ఇక, ఐదో సంతకాన్ని కూడా పవన్ ప్రకటించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఏ విధంగా నడిపించాలో తన ఐదో సంతకం చెబుతుందని చెప్పారు. సరే.. రాజకీయ నాయకుడిగా ఆయన ఈ ప్రకటనలు చేసి ఉండొచ్చు. కానీ, పార్టీలో కార్యకర్తలు మాత్రం పవన్‌పై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన సంతకాల హామీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. పార్టీని బలోపేతం చేయాలని భావించారు.
కానీ, మళ్లీ ఇప్పటి వరకు పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. పైగా.. వచ్చే ఎన్నికల్లో సీఎం కావాలని ఒకసారి.. తనకంటే సీనియర్లున్నారని మరోసారి..ఇలా అనేక ప్రకటనలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ సంతకాల విషయాన్ని ఏం చేయాలనే దానిపై కార్యకర్తలు తల్లడిల్లుతున్నారు.
దీనిపై పవన్ ఏమైనా స్పష్టత ఇస్తారో.. లేక ఇలానే వదిలేస్తారో చూడాలి. ఏమీ లేనప్పుడు.. కనీసం ఈ విషయాన్నయినా.. ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.