Begin typing your search above and press return to search.

సీఎం పదవితో పవన్ మరోసారి దోబూచులాట!

రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్‌ చెబుతున్నారని.. ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమని అన్నారు పవన్

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:17 AM GMT
సీఎం పదవితో పవన్ మరోసారి దోబూచులాట!
X

కర్ర ఇరగకూడదు.. పామూ చావకూడదు! జనసైనికులు నిరాశ చెందకూడదు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేయకూడదు! ఇదే సమయంలో బీజేపీతో పొత్తు ఉందనకూడదు.. ఆసక్తి లేదని చెప్పకూడదు!... వారాహి యాత్రలో భాగంగా అవనిగడ్డలో పవన్ ప్రసంగం సాగిందింలా అని అంటున్నారు పరిశీలకులు. మరి ముఖ్యంగా సీఎం పోస్ట్ విషయంలో పవన్ నిత్యం ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారనేది తెలిసిన విషయమే!

అవును... సీఎం పోస్ట్ వద్దు, పూర్తిగా బాబు బాగుకోసమే పని చేద్దాం అని జనసేన అధినేత పిలుపు ఇస్తే... గతంలో కమ్యునిస్టులు బాబుకు ఎలా సహకరించేవారో అలా చేద్దాం అని చెబితే... 90% మంది జనసైనికులు ఎవరి పని వారు చూసుకుంటారనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటాయి. లేదు... తానే సీఎం అభ్యర్థిని అని ప్రకటిస్తే... 90% టీడీపీ కేడర్ పొత్తుకు దూరం జరిగిపోద్ది! ఇవన్నీ తెలిసిన పవన్... అత్యంత జాగ్రత్తగా మాట్లాడినట్లు తెలుస్తుందని అంటున్నారు పరిశీలకులు!

మహా భారతం - బైబిల్:

ఇటీవల జగన్ రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంతో పోల్చిన సంగతి తెలిసిందే. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాను ఒంటరిగానే వస్తానని, మీ బిడ్డ నమ్మింది పైన దేవుడిని, కింద మిమ్మల్ని అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు! ఇదే విషయాలను ప్రస్థావించిన పవన్... కురుక్షేత్రమే కావాలంటే కురుక్షేత్రమే కానీ... వైసీపి నేతలు కౌరవులు అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే... వారు 100మంది దాటి ఉన్నారని గుర్తుచేశారు!

ఇదే సమయంలో మత ప్రస్థావన తీసుకురావాలనుకున్నారో.. లేక, తనకు బైబిల్ గురించి తెలుసు అని చెప్పే ప్రయత్నం చేశారో తెలియదు కానీ... దావీదు - గొలియాతు యుద్ధ సన్నివేశాన్ని ప్రస్థావించారు పవన్. అయితే ఇక్కడ తాను దావీదు టైపు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ... జగన్ ని గొలియాతు తో పోల్చే పనికి పూనుకున్నారు.

175 కాదు... 15 వస్తే గొప్ప:

రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్‌ చెబుతున్నారని.. ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమని అన్నారు పవన్. ఇదే సమయంలో 2014లో తన వల్లే సీఎం పదవి చేజారిపోయిందని జగన్‌ కు కోపం అని చెప్పుకొచ్చారు పవన్. దీంతో.. 2014లో చంద్రబాబు సీఎం అవ్వడానికి తానే కారణం అని జనసైనికులకు చెప్పి కాన్ ఫిడెన్స్ పెంచే ప్రయత్నంతో పాటు.. టీడీపీ కేడర్ కి సైతం తన స్థాయిని చూపించే ప్రయత్నం చేశారని అంటున్నారు.

సీఎం ప‌ద‌వి వస్తే ఓకే... మోజు లేదు:

వారాహి యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జనసైనికులకు - జనసేనానికీ మధ్య నలుగుతున్న అతి పెద్ద సమాధానం లేని ప్రశ్న ఏమైనా ఉందంటే అది ఇదే! పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థా.. చంద్రబాబు సీఎం అభ్యర్థా అని! దీనికి... కచ్చితంగా చంద్రబాబే అని టీడీపీ కేడర్ చెప్పగలరు.. కానీ, జనసైనికులకు ఆ ఛాన్స్ లేదు..! కారణం పవన్ వారిని అలా కన్ ఫ్యూజన్ స్టేట్ లో కంటిన్యూ చేయిస్తూనే ఉన్నారు.

తాను సీఎం అభ్యర్థిని కాదు.. చంద్రబాబు సీఎం అభ్యర్థి.. జగన్ ని దించడం కోసమే మనం టీడీపీతో జతకడుతున్నాం.. అని పవన్ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు లేదు!! సీఎం లేదా అంతకంటే పెద్ద పోస్ట్ ఇస్తే తీసుకోవడానికి తాను సిద్ధమే కానీ... ఆ పదవిపై మోజు లేదు అని పవన్ మరోసారి చెప్పారు! జనసైనికులు చప్పట్లు కొట్టారు!!

జగన్ గురించి మోడీకి చెప్పొచ్చు కానీ...:

నరేంద్ర మోడీ వద్ద ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కు ఉన్న స్థానం ఏమిటి అనే సంగతి కాసేపు పక్కనపెడితే... చంద్రబాబు అరెస్ట్ అనంతరం అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం లోకేష్ చేయని ప్రయత్నం లేదని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో అసలు మోడీతో ఎంతో చనువు ఉన్నదని చెప్పుకునే పవన్... లోకేష్ కు ఎందుకు సాయం చేయలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు.

ఈ సమయంలో మరోసారి మోడీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేశారు పవన్. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ ఇబ్బంది పెడుతున్నారని ఏనాడు ప్రధాని మోడీతో తాను చెప్పలేదని, నా నేల‌ కోసం‌ నేను పోరాడుతాను.. అంతేకానీ.. దేహీ అని ఎవర్ని అడగను అని చెప్పుకొచ్చారు!

నాడు మహిళల అదృశ్యం - నేడు విద్యార్థుల మరణం:

వారాహియాత్రలో భాగంగనే పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసంగించిన పవన్... వాలంటీర్లు సంఘవిద్రోహశక్తులతో చేయికలిపినందుకు ఏపీలో 31,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 5 నుంచి 18 ఏళ్లలోపు 62,754 మంది విద్యార్థులు మరణించారని.. 3,88,000 మంది విద్యార్థులు చదువు మానేశారని చెప్పుకొచ్చారు.