పవన్ ఢిల్లీ రాజకీయం : మోడీకి చెప్పాల్సింది ఏమైనా ఉందా ...?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఇరవై రోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీసులో క్యాడర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు
By: Tupaki Desk | 2 Oct 2023 9:38 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఇరవై రోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీసులో క్యాడర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. తాను తొందరలో ఢిల్లీకి వెళ్తాను అని. తాను ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి టీడీపీతో పొత్తు గురించి వారికి వివరించడం తన బాధ్యత అన్నారు. అసలు ఏపీలో ఏ పరిస్థితులలో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చిందో బీజేపీ పెద్దలకు వివరిస్తాను అని చెప్పారు.
పవన్ నోటి వెంట ఈ ప్రకటన వచ్చి చాన్నాళ్ళు అవుతున్నా ఆయన ఢిల్లీకి అయితే వెళ్ళలేదు. ఇక లేటెస్ట్ గా అవనిగడ్డలో ఆయన వారాహి యాత్ర సభను నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ ఏపీలో సీఎం జగన్ అవినీతి గురించి కేంద్ర పెద్దలకు తెలియదా అన్నట్లుగా మాట్లాడారు. తాను జగన్ గురించి ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు ఏవీ చేయనని తాను ఏపీలోనే తేల్చుకుంటాను అని మరో మాట కూడా అన్నారు.
దీన్ని బట్టి అర్ధం ఏంటి అంటే పవన్ ఢిల్లీ వెళ్లబోవండం లేదనే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సడెన్ గా టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం పట్ల బీజేపీ పెద్దలు గుస్సాగా ఉన్నారు అన్న ప్రచారం అయితే ఉంది. తమతో పొత్తులో ఉంటూ మిత్రుడిగా ఎండీయే భేటీకి కూడా హాజరైన పవన్ ఉన్నట్లుండి టీడీపీ వైపు మొగ్గు చూపడమే కాకుండా పొత్తు ప్రకటన కూడా తమతో చెప్పాపెట్టకుండా అనౌన్స్ చేయడం పట్ల కమలనాధులు మధనపడుతున్నారని అంటున్నారు.
అందుకే ఢిల్లీ వైపు నుంచి పిలుపు అయితే రాలేదు అని అంటున్నారు. ఇక చంద్రబాబు జైలులో ఉన్నారు. పవన్ బీజేపీ మిత్రుడిగా ఢిల్లీ వెళ్లి బాబు అరెస్ట్ అక్రమం అని కేంద్ర పెద్దలకు చెప్పవచ్చు కదా అన్న చర్చ కూడా ఈ మధ్య దాకా సాగింది. అంతే కాదు నారా లోకేష్ ఢిల్లీలో గత పదిహేను రోజులుగా ఉంటూ వస్తున్నారు. ఆయన బీజేపీ పెద్దలతో భేటీ కావాలని చూస్తున్నారు అని అంటున్నారు.
మరి ఎటూ టీడీపీతో పొత్తు కలిపిన పవన్ నారా లోకేష్ కి కేంద్ర బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అన్న చర్చ కూడా సాగింది. తెలుగుదేశం క్లిష్ట పరిస్థితులలో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అదే టైం లో బీజేపీతో కూడా మిత్రుడిగా ఉన్నారు. ఒక రకంగా పవన్ ది అనుసంధాన పాత్ర అనుకున్నపుడు ఆయన బీజేపీ పెద్దలతో చెప్పి ఏపీలో విపక్షాల మీద అందునా విశేష అనుభవం ఉన్న నాయకుడి మీద అక్రమ కేసులు అరెస్టులు జరుగుతున్నాయని కాషాయ పెద్దలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నది ఒక ప్రశ్నగా ఉంది.
ఇక పవన్ రేపో మాపో ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ పెద్దలను కలసి ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తుకు కూడా ఖరారు చేస్తారని ఏపీలో ఒక వర్గం నేతలు ఆశగా ఉన్నారు. మిత్రుడిగా పవన్ మాటను కేంద్ర బీజేపీ నేతలు వింటారని వారు ఆశతో ఉన్నారు. అయితే పవన్ మాత్రం ఏపీలో నా ఆట నేనే ఆడతాను అని చెప్పడం వెనక అర్ధాలు ఏంటి అని ఆరా తీసే పనిలో అంతా పడ్డారు.
ఇక పవన్ బీజేపీ ఊసు ఎత్తకుండా జనసేన టీడీపీ ప్రభుత్వం మాత్రమే వస్తుంది అని చెప్పడంతో ఏపీలో బీజేపీ టీడీపీతో పొత్తులకు తహతహలాడే ఒక సెక్షన్ లీడర్లు మాత్రం కలవరపడుతున్నారని అంటున్నారు. ఇదే తీరున బీజేపీని సైడ్ చేసి జనసేన టీడీపీ ముందుకు సాగితే కేంద్ర బీజేపీ పెద్దలు కూడా పవన్ విషయం పక్కన పెట్టేస్తే తమ గతేం కానూ అన్న బెంగ కూడా చాలా మందిలో ఉంది అని అంటున్నారు.
సో మరింత వివరంగా స్పష్టంగా సన్నివేశం కనిపిస్తే మాత్రం ఏపీ బీజేపీలోని ఒక వర్గం నాయకులు మాత్రం తమ దారి తాము చూసుకుంటారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఇపుడు పవన్ వైఖరి చూస్తే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోవడంలేదు అనే అంటున్నారు. చూడాలి మరి బీజేపీ వైపు నుంచి ఏ రకమైన సంకేతాలు దీని మీద వస్తాయో.