ఎన్డీఏ నుంచి బయటకు... పవన్ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం వారాహి నాలుగో విడత యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 5 Oct 2023 5:31 AM GMTప్రస్తుతం వారాహి నాలుగో విడత యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న యాత్ర కావడంతో... ఈ సభలకు టీడీపీ కేడర్ నుంచి కూడా మద్దతు దొరుకుతుందని తెలుస్తుంది. పవన్ బహిరంగ సభల్లో అక్కడక్కడా పసుపు జెండాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్డీఏ కూటమి విషయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అయిన అనంతరం... ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నామని పవన్ తెలిపారు. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టీడీపీ కేడర్ కూడా పవన్ తో కలిసి నడుస్తున్నారనే అనుకోవాలి. మరోపక్క బీఇజేపీ నేతలు మాత్రం... పవన్ మాతోనే పొత్తులో ఉన్నారని నిన్నటివరకూ చెప్పారు.
ఈ సమయంలో తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, కష్టమైనా తప్పలేదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపిన పవన్ కల్యాణ్... అందుకు కారణం టీడీపీ బలహీనంంగా ఉండటమే అనే తనదైన లాజిక్ తెరపైకి తెచ్చారు. కృష్ణాజిల్లా పెడనలో మాట్లాడిన పవన్ కల్యాణ్... ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి, టీడీపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఇబ్బందిగా ఉన్నా తప్పలేదనీ చెప్పిన పవన్ కల్యాణ్... టీడీపీ బలహీన పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నప్పుడు.. టీడీపీ అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం, జనసేన యువరక్తం టీడీపీకి అవసరం అని అన్నారు. ఇదే సమయంలో జనసేన పోరాటపటిమ రాష్ట్రానికి చాలా అవసరం అని పవన్ తెలిపారు.
ఇదే క్రమంలో.... తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ రెండూ కలిస్తే జగన్ ని అధఃపాతాళానికి తొక్కేయొచ్చని.. ఆ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని.. అందరూ కలిసి ఈ పొత్తును ముందుకు తీసుకుని వెళ్లాలని తెలిపారు. ఫలితంగా... రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఇదే సమయంలో టీడీపీ-జనసేన కూటమితో కలవడానికి ఎవరు వచ్చినా వారికోసం తాను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ ప్రకటించారు. అనంతరం... కేంద్రం కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపిన పవన్ కల్యాణ్... టీడీపీ-జనసేన కూటమికి కేంద్రం బ్లెస్సింగ్ ఉండాలని కోరడం గమనార్హం.
వలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం!:
మొదటినుంచీ వాలంటీర్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్... తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమైందని పవన్ తెలిపారు. వాలంటీర్లతో కేసులు పెట్టించాలని చూస్తున్నారని.. అది రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థ అని, ఆ సంగతి కోర్టుల్లోనే తేల్చుకుంటామని పవన్ స్పష్టంచేశారు.