మినహాయింపు అడుగుతున్న పవన్... బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్?
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Oct 2023 4:25 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే... చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు స్పందించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై పవన్ స్పందించారు.
అవును... స్కిల్ స్కం కేసులో చంద్రబాబు అరెస్టైన అనంతరం రాఘవేంద్రరావు, అశ్వినీదత్, మురళీమోహన్, నట్టి కుమార్ మినహా పెద్ద ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు! మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదనే చర్చ తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం ఇండస్ట్రీకి లేదన్నట్లుగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు తెలిపారు!
ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా బాలకృష్ణ స్పందించాడు. "ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది కాదని అనడం తప్పే. వాళ్లు కూడా పౌరులే కదా. వాళ్ల సినిమాల్ని జనం చూడాల్సిందే. వాళ్లను నా సెక్షన్ నుంచి తీసేశాను" అంటూ రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో... జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై "డోంట్ కేర్" అనే కామెంట్ చేశారు!
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇండస్ట్రీలో ఏ పార్టీకి వారికి సెపరేట్ సపోర్టర్స్ ఉన్నారని... నాడు ప్రభాకర్ రెడ్డి, కృష్ణ.. కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉండేవారని అన్నారు. ఇక టీడీపీకి ఉండే సపోర్ట్ వారికి ఉందని, తనవల్ల జనసేనకూ కొద్దో గొప్పో ఉందని తెలిపారు. అయితే ఇవి నాటి రోజులు కాదని పవన్ చెప్పుకొచ్చారు.
గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలాదీశుడు వంటి సినిమాలు తీయగలిగారని, కోట శ్రీనివాస్ రావు లాంటి వారు ఆ సినిమాల్లో నటించారని.. అయినా కూడా వారిపై కక్ష సాదింపు చర్యలు ఉండేవి కాదని పవన్ తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితులు అలా లేవని... రజనీకాంత్ అంతటివారని సైతం చెడుగుడు ఆడుకున్నారని అన్నారు. అలాంటప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారో, కాస్త సెటిల్ అయినవారో స్పందించలేరని చెప్పుకొచ్చారు.
కాబట్టి... చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడం, రాజకీయాల్లో జరిగే సంఘటనలపై స్పందించడం అనే అంశంలో సినిమా ఇండస్ట్రీకి మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో... అటు బాలకృష్ణ వ్యాఖ్యలతో విభేదిస్తూనే... మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాకపోవడాన్ని కూడా పరోక్షంగా సమర్ధించారని అంటున్నారు పరిశీలకులు.
కాగా... మండలాదీశుడు సినిమా విడుదల అనంతరం తననూ బెజవాడ రైల్వే స్టేషన్ లో ఎన్టీఆర్ అభిమానులు తరిమి తరిమి కొట్టారని కోట శ్రీనివాస రావు చెప్పిన సంగతి తెలిసిందే! ఆ రోజు తన ప్రాణం పోద్దేమో అనుకున్నట్లు ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన తెలిపారు.