చిన్న చిన్న తప్పులే.. పవన్‌కు శాపంగా మారాయా?
ఇక, వైసీపీ కోవర్టులు అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్య కూడా అంతర్గతంగా పార్టీలో ఇప్పటికీ దుమారం రేపుతోంది
By: Tupaki Desk | 17 Dec 2023 5:55 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద శాపాలుగా మారాయా? ఆయన దూకు డుకు కళ్లెం వేస్తున్నాయా? ఆయన ఆలోచనలకు ఇబ్బందిగా మారాయా? ఆయన వ్యూహాలను ప్రజల్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా టీడీపీ-జనసేన ఎన్నికల పొత్తుల విషయంపై తన వ్యూహాన్ని పార్టీ కార్యకర్తలకు వివరించి చెప్పడంలోనూ.. వారిని ఒప్పించడంలోనూ పవన్ సక్సెస్ కాలేక పోయారనే వాదన ఉంది.
ఇక, వైసీపీ కోవర్టులు అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్య కూడా అంతర్గతంగా పార్టీలో ఇప్పటికీ దుమారం రేపుతోంది. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం వైసీపీ అంతర్గత కుమ్ములాటతో కునారిల్లు తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన తరఫున జెండాలు పట్టుకుని.. జంపిం గులు చేసేవారి సంఖ్య పెరగాల్సి ఉంది. కానీ, ఆ ఊపు, నేర్పు ఎక్కడా కనిపించడం లేదు. ఇది కూడా పవన్ వ్యూహాత్మక తప్పిదంగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు.
మరోవైపు.. యువగళంపాదయాత్ర ముగింపు సభకు వస్తానని.. ఆ వేదికగానే.. తన అభిప్రాయాలను మరింతగా వివరిస్తానని చెప్పిన పవన్.. అనూహ్యంగా ఈసభకు డుమ్మా కొడుతున్నట్టు ప్రకటించారు. అధికారికంగా ఆయన చెప్పిన మాట కూడా.. వినసొంపుగా లేకపోవడం గమనార్హం. 'అని వార్య' కారణాల నేపథ్యంలోనే యువగళం ముగింపు సభకు రాలేకపోతున్నానని పవన్ ప్రకటించారు. ఇది పాజిటివ్ సంకేతాలకన్నా కూడా.. నెగిటివ్ సంకేతాలనే ఇచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
మరీ ముఖ్యంగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ ముందుకు సాగారు. అయితే.. చివరి వరకు టికెట్ల విషయంపై తేల్చకపోవడం, తన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో బీజేపీ దూరంగా ఉండడం.. అదీగాక.. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇక, తమకు జనసేనతో పనిలేదని.. స్వయంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలను కూడా పవన్ ఖండించలేక పోయారు. దీంతో ఈ ప్రభావం ఏపీ జనసేనపై పడింది. మొత్తానికి ఇలాంటి చిన్న చిన్న తప్పులను పట్టించుకోకపోతే.. ఎన్నికలకుముందు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.