'కాపు పెద్దలు' పై పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. తాజాగా ఆయన కాపులకు కీలక సూచనలు చేశారు
By: Tupaki Desk | 5 Jan 2024 6:49 AM GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులదే కీలక పాత్ర. రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గంగా దాదాపు 23 శాతం జనాభాతో రాజకీయ పార్టీల గెలుపు ఓటములను శాసిస్తున్నారు. గత ఎన్నికల్లో కాపులు వైసీపీకి జైకొట్టారు. ఈసారి అత్యధిక శాతం జనసేన, టీడీపీ కూటమితో వెళ్లే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గంపై వైసీపీ దృష్టి సారించింది. ఆ వర్గం నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన కులాన్ని చంద్రబాబు పాదాల వద్ద పెట్టాడని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి ఆశపడి కులాన్ని అమ్ముకుంటున్నాడని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇంకోవైపు వైసీపీలో ఉన్న కాపు సామాజికవర్గం నేతలతో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయిస్తోంది.
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు. తాజాగా ఆయన కాపులకు కీలక సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తేల్చిచెప్పారు. ఈ విషయం ఆ పార్టీకి అర్థమయ్యే కాపు ఓట్లలో చీలిక తేవడానికి, కొందరు కాపు పెద్దలతో తనను తిట్టిస్తోందని పవన్ మండిపడ్డారు. కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచే కుట్రలకు దిగుతోందని పవన్ ఆరోపించారు.
వైసీపీ వలలో కాపులెవరూ పడొద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తనను కించపరుస్తూ, దూషిస్తూ, తనపై, జనసేనపై తప్పుడు కథనాలు రాయిస్తోందని, విష ప్రచారం చేయిస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రాయోజిత కథనాలను, విష ప్రచారాన్ని కాపులెవరూ నమ్మవద్దని, అలాగే ఇతర కులాలవారు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కాపు సామాజికవర్గానికి చెందినవారి మొబైల్ ఫోన్లకు సందేశాలు కూడా పంపిస్తోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని తాను ప్రారంభించిన కార్యాచరణ ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కంటగింపుగా మారిందని పవన్ తెలిపారు. అన్ని సామాజికవర్గాల్లో నిర్దిష్టమైన ఓట్ల శాతంతో పాటు, కాపు సామాజికవర్గంలో బలమైన మద్దతు జనసేనకు ఉండటం వైసీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. అందుకే కొందరు కాపు పెద్దలను కుట్రపూరితంగా జనసేనపై ప్రయోగిస్తోందని మండిపడ్డారు. వారితో తనపైనా, పార్టీపైనా సామాజిక మాధ్యమాల్లో విషపురాతలు రాయిస్తోందని ధ్వజమెత్తారు. ఆ వార్తలను కేవలం కాపు సామాజికవర్గం వారి ఫోన్లకే పంపుతోందని బాంబుపేల్చారు.
రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజికవర్గం గురుతర పాత్ర పోషించనుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్న తన నిర్ణయాలకు విస్తృత మద్దతు లభిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సాధికారితతో పాటు అగ్రవర్ణ పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలనేది తన ఉద్దేశమన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానంతో తాను అడుగులు వేస్తున్నానన్నారు.
అనేక బీసీ కులాలు, సంఖ్యాబలం లేని ఎంబీసీలు, మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ కులాలను కలిపి అడుగులు వేసే సమర్థత ఉన్నందునే కాపులు పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా కాపు యువత, మహిళలు, విజ్ఞులు నడుం బిగించాలని కోరారు. దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అవి ఇప్పటికిప్పుడు కంటికి కనిపించకపోవచ్చన్నారు. తాను ఆశించిన లక్ష్యాలు నెరవేరిన రోజున ఇప్పుడు తనను దూషిస్తున్న కాపు పెద్దలు కచ్చితంగా హర్షిస్తారు అని పవన్ వెల్లడించారు.
కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు వెళ్లిందో కాపు సామాజికవర్గం గుర్తించిందని పవన్ తెలిపారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఆ వర్గానికి బలమైన జిల్లాలోనే ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలని పవన్ కోరారు. కాపు కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఏమైందో నిలదీయాలన్నారు.
ఈడబ్లు్యఎస్ రిజర్వేషన్లలో కాపుల కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలని కోరారు. కాపులను కాపు నాయకులతోనే తిట్టిస్తున్న వ్యక్తిని కాకుండా, నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని తనకు ఎంతో గౌరవం ఉన్న కాపు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వారికి జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుంది అని తెలిపారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని నారా లోకేశ్ వ్యాఖ్యానించడం, దానిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య.. దీనిపై స్పష్టత ఇవ్వాలని పవన్ కు లేఖ రాయడం, దీన్ని అందిపుచ్చుకుని వైసీపీ పవన్ సీఎం కాడని, చంద్రబాబును సీఎం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఉధృత ప్రచారం చేస్తుండటం వంటి కారణాలతో పవన్ కళ్యాణ్ ఈ మేరకు కాపులకు స్పష్టతనిచ్చారు. వైసీపీ వలలో చిక్కుకోవద్దని సూచించారు.