బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రచారం... ఎక్కడ ఎందుకు..!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీకి మౌత్ పీస్‌గా మారనున్నారు.
By: Tupaki Desk | 2 Nov 2024 10:30 AM GMTజనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీకి మౌత్ పీస్‌గా మారనున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. వీటిలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఉన్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో బీజేపీకి ప్రచారం చేసేందుకు.. పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నట్టు సమాచారం. అందుకే.. ప్రస్తుతం నవంబరు రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయన్నవార్తల నేపథ్యంలో ఆ లోపే.. తన ప్రచారం పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
తెలంగాణతో బోర్డర్ ఉన్న పలు మహారాష్ట్ర జిల్లాల్లో పవన్ బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర లో కూటమిగా వెళ్తున్న బీజేపీ పుంజుకుని అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును కమల నాధులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ-అజిత్ పవార్)లు `మహాయుతి`గా ఏర్పడి పాలిస్తున్నారు.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీకి మంచి బలమే ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు దక్కాయి. అయినా.. పూర్తిస్థాయిలో మెజారిటీ రాకపోయేసరికి.. ఇబ్బందులు పడింది. ఇక, ఇప్పుడు మాత్రం తాము ఒంటరిగానే మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న ఉత్సాహంతో బీజేపీ ముందుకు సాగుతుండడం గమనార్హం. అయినా.. ఎక్కడైనా చిన్న తేడా కొట్టినా.. కాంగ్రెస్ పుంజుకుంటుం దన్న చర్చ ఉంది.
అందుకే.. అన్ని వైపుల నుంచి బీజేపీ మోహరిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఉన్న సినీ ఇమేజ్‌తో పాటు.. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం అనంతరం.. ఆయన లేవనెత్తిన సనాతన ధర్మం.. సెంటిమెంటు అస్త్రం కూడా బాగానేవర్కవుట్ అయిందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను తెలంగాణ సరిహద్దు జిల్లాల పరిధిలో ప్రచారం చేయించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి కేంద్ర పెద్దల నుంచి పవన్‌కు సమాచారం కూడా అందిందని.. డేట్లు ఫిక్సవుతున్నాయని సమాచారం.