Begin typing your search above and press return to search.

పవన్ ఢిల్లీ టూర్ హిట్టా ఫట్టా...?

చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది అని మీడియా ముఖ్యంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   19 July 2023 12:46 PM GMT
పవన్ ఢిల్లీ టూర్ హిట్టా ఫట్టా...?
X

సాధారణంగా రాజకీయ ప్రాంతీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఢిల్లీ టూర్ల మీద సాదర జనంతో పాటు రాజకీయ వర్గాలలో ఆసక్తి మెండుగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ అంటేనే దేశ రాజధాని, జాతీయ రాజకీయాలకు కూడా సిసలైన రాజధాని. అందువల్ల అక్కడ నుంచి ఏవైనా సంచలనాలు రేగితే అవి ప్రాంతీయ స్థాయిలోనూ ప్రకంపనలకు దారి తీస్తాయి.

ఇదిలా ఉంటే బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే మీటింగ్ ఈ నెల 18న జరుగుగుతుంది అని చాలా కాలం క్రితం నుంచే ఒక పెద్ద ప్రచారం సాగుతూ వచ్చింది. ఈ మీటింగుతో ఏపీలో రాజకీయాలు అన్నీ మారిపోతాయని పొత్తుల కధ కూడా ఒక కొలిక్కి వస్తుందని భావించారు. దానికి తోడు తెలుగుదేశాన్ని కూడా ఎన్డీయే మీటింగ్ కి పిలుస్తారు అని అని ఊదరగొట్టే ప్రచారం ఒకటి సాగింది.

ఇక తీరా చూస్తే జనసేన ఒక్క దానికే ఇన్విటేషన్ వచ్చింది. ఢిల్లీలో దిగిన పవన్ తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది అని మీడియా ముఖ్యంగా ప్రకటించారు. అలా ఆయన తన ఢిల్లీ టూర్ మీద ఆసక్తిని బాగా పెంచేశారు. ఇక ఢిల్లీలో పవన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు ఖాయమని కూడా చెప్పుకొచ్చారు. నిజానికి ఇది పవన్ తొందరపాటుతో అన్నారా లేక ఆయన ఒక వ్యూహం ప్రకారం అన్నారా అన్నది తెలియదు కానీ బీజేపీ మాత్రం ఏపీలో పొత్తుల విషయంలో పెదవి విప్పి ఏమీ చెప్పలేదు. కేవలం జనసేన తోనే పొత్తులు ఉంటాయని పేర్కొంది.

అంతే కాదు పవన్ని మాత్రమే పిలిచింది. అలా మాటల కంటే చేతలతోనే బీజేపీ వ్యవహరిస్తూ వస్తోంది. కానీ పవన్ మాత్రం మూడు పార్టీలు పొత్తులు అంటూ వస్తున్నారు. అది బీజేపీకి ఎంతవరకూ ఇష్టంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇక ఎన్డీయే భేటీలో ఏపీ రాజకీయాల మీద ఎలాంటి చర్చలూ జరగలేదని పవనే మీడియాకు చెప్పారు. అంతా జాతీయ రాజకీయాల మీదనే సాగింది అని అన్నారు. అంటే ఎన్డీయే మీటింగ్ లో ఏమీ జరగలేదు అనుకోవాలి. అంతా ఇంతా అని అనుకున్న ఈ భేటీ కేవలం బీజేపీ విపక్ష కూటమికి పోటీగా తమకూ బలం ఉందని చెప్పుకోవడానికి భారీ లిస్ట్ తో చిన్న పార్టీలతో ఒక ప్రదర్శన చేసింది అని అంటున్నారు.

అంటీ ఇది బీజేపీ మార్క్ రాజకీయం తప్ప మరోటి కాదు అని అంటున్నారు. అలా తాము పిలిస్తే పార్టీలు రావడం మోడీ స్పీచ్ విని వెళ్ళడం తప్ప కొత్తగా ఏమీ జరగలేదు అని అంటున్నారు. ఇక ఏపీ రాజకీయాలు తారు మారు అవుతాయని, భూమి బద్దలు అవుతుందని జరిగిన ప్రచారం అంతా ఏమిటి అంటే మీడియా ప్రచారమేనా అన్న డౌట్లు వస్తున్నాయి.

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.అన్ని పార్టీల మాదిరిగానే ఆయన ఎన్డీయే మీటింగులో పార్టిసిపేట్ చేశారు. ఇక బుధవారం ఆయన ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ తో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దలు అయిన మోడీ అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారు అవుతాయా లేదా అన్న సస్పెస్ ఉంది. ఈ లోగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తొందరలోనే పవన్ కళ్యాణ్ తో తాను భేటీ అయి రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం చర్చిస్తామని చెప్పారు.

దీనిని బట్టి చూస్తే పవన్ ఢిల్లీ పెద్దలతో భేటీ వంటివి ఈ ట్రిప్ లో ఉండవనే అంటున్నారు. పవన్ తాను ఒక బ్లూ ప్రింట్ ని రెడీ చేసి ఉంచారని, దాన్ని కేంద్ర బీజేపీ పెద్దలకు ఇస్తారని ఏపీలో టీడీపీ బీజేపీ, జనసేన పొత్తుల ఆవశ్యకత ఎంతటి అవసరమో అందులో తేల్చి చెప్పారని అంటున్నారు. కానీ బీజేపీ పెద్దల నుంచి అపాయింట్మెంట్లు ఖరారు అయి భేటీలు జరిగితేనే ఇదంతా జరిగేది.

అయితే పవన్ ఢిల్లీ టూర్ లో మాత్రం మురళీధరన్ తోనే సరిపెట్టనున్నారా లేక తాను అనుకున్న విధంగా మోడీ అమిత్ షాలతో భేటీ అవుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జనసేనాని ఢిల్లీ టూర్ లో ఏమి సాధించారు అంటే పెద్దగా ఎమీ లేదు. జస్ట్ అలా మీటింగ్ కి వెళ్లి వచ్చారు అంతే అని అంటున్నారు. ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పే చాన్స్ ఈ క్షణానికీ బీజేపీ తన వద్దనే ఉంచుకుందని, ఏవరికీ పెద్దన్న పాత్రను ఇచ్చే సీన్ అయితే లేనే లేదు అని అంటున్నారు.