పవన్ లేవనెత్తిన సనాతన ధర్మం...ఆరెస్సెస్ ఏమందంటే ?
అంతటితో ఆగకుండా ఆయన ఏకంగా తిరుపతిలో వారాహీ సభ పెట్టి మరీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు.
By: Tupaki Desk | 13 Oct 2024 12:30 AM GMTఅసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఈ చర్చ ఎందుకు అంటే పాపులర్ సినిమా హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు. అంతటితో ఆగకుండా ఆయన ఏకంగా తిరుపతిలో వారాహీ సభ పెట్టి మరీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు.
సనాతన ధర్మం వాదనకు ఆయన పూర్తిగా మద్దతు ఇస్తూ దేశంలో సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రాల్లో కూడా దానికి పెట్టాలని సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పవన్ ప్రతిపాదించారు.
దాంతో అది ఒక బిగ్ డిబేట్ గా మారింది. జాతీయ స్థాయిలో కూడా దాని మీద మీడియా హౌస్ లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ సాగాయి. అభ్యుదయవాదులతో పాటు వామపక్షాలు కూడా సనాతన ధర్మం మీద విమర్శలు చేశారు.
ఇపుడు చూస్తే విజయదశమి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్ పూర్ లోని కేంద్ర కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సనాతన ధర్మం మీదనే ప్రసంగం చేశారు.
సనాతన ధర్మం అంటేనే ఎవరూ సృష్టించలేనిదని అనాదిగా ఉన్నదని అర్ధం చెప్పారు. సనాతన ధర్మం అంటే భారతదేశ సారాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. అది ఒక మతం కానే కాదని ఆయన చెప్పుకొచ్చారు. హిందూ ధర్మం అనేది కొత్తగా కనుగొనబడింది కాదని అలాగే సృష్టించబడింది కూడా కాదన్నారు.
ఈ ధర్మం మొత్తం ప్రపంచంలోని ఇది మానవాళికి అనుసరణీయం అని కూడా ఆయన చెప్పారు. ఇదే జీవన విధానం అన్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రపంచానికి అదే ఒక మతంగా మారిందన్నారు. భగవత్ చెప్పిన సనాతన ధర్మం అంటే హిందూత్వ భావనతో కూడినది అంటూనే అది మతం కాదు జీవన విధానం అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కూడా హిందువుల పరిరక్షణకు సనాతన ధర్మ బోర్డు ఉండాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మాతృ సంస్థగా ఉన్న ఆరెస్సెస్ చీఫ్ ఈ విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడం అది కూడా పండుగ వేళ అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమైనా ఆ దిశగా ఆలోచన చేస్తుందా అన్న చర్చ మొదలైంది.
సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలన్న పవన్ డిమాండ్ మీద కసరత్తు జరుగుతుందా అన్నది కూడా ఇపుడు అంతా ఆలోచిస్తున్న విషయం. ఆరెస్సెస్ భావన ఇది అని ఇప్పటికే కామ్రేడ్స్ పవన్ డిమాండ్ మీద మండి పడుతున్నాయి. ఇపుడు ఆరెస్సెస్ అదే మాట అనడంతో పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఆలోచనలకు ఆస్కారం ఇస్తున్నాయా అన్నది కూడా చూడాల్సి ఉంది.
సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా ఒక్కటే అన్నది ఆరెస్సెస్ భావన. అది మతం కాదని ఆరెస్సెస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అయితే పవన్ వ్యాఖ్యలలో చూస్తే హిందూ మత రక్షణ కోసం సనాతన ధర్మం అనుసరించాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఆరెస్సెస్ చీఫ్ దీని మీద తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి సనాతన ధర్మం మీద చర్చ మొదలైంది. కేంద్రం ఏమి చేస్తుంది అన్నదే ఇపుడు ఆసక్తిని కలిగించే విషయంగా చూడాలి.