ఎదురు చూస్తున్న అవకాశం అంటున్న పవన్...మ్యాటరేంటో...?
తనకు ఇది ఎదురుచూస్తున్న అవకాశం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు.
By: Tupaki Desk | 17 July 2023 3:55 PM GMTతనకు ఇది ఎదురుచూస్తున్న అవకాశం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన ఎన్డీయే కీలక సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నరు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ బీజేపీ పెద్దలతో జరిగే కీలక సమావేశానికి తనకు ఆహ్వానం అందిందని అన్నారు. ఇది నిజంగా తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం అని ఆయన మీడియాకు చెప్పారు.
ఎన్డీయే భేటీ గురించి మాట్లాడుతూ ఏపీలో పొత్తుల గురించి బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ హింట్ ఇచ్చారు. ఇక బీజేపీ పెద్దలను తాను 2014 ఎన్నికల సమయంలో కలిశాను అని ఆయన చెప్పారు. ఆ టైంలో వారితో కలసి పనిచేశామని, 2019లో విడిగా పోటీ చేశామని, ఇపుడు ఎన్డీయేలో ఉన్నామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే పవన్ ఎదురుచూసిన అవకాశం అంటున్నారు. మరి ఆయన ఆ అవకాశాన్ని ఎలా వాడుకుంటారు అన్నది కూడా చర్చకు వస్తోంది. మరో వైపు చూస్తే ఏపీలో పొత్తుల గురించి బీజేపీ పెద్దలతో చర్చిస్తామని అంటున్నారు. నిజానికి బీజేపీ జనసేన పొత్తులలోనే ఉన్నాయి. కాబట్టే ఆయన్ని ఎన్డీయే మీటింగ్ కి పిలిచారు.
మరి కొత్తగా పొత్తుల గురించి చర్చిస్తామంటే టీడీపీ తో పొత్తుల గురించేనా అన్న చర్చ అయితే వస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీతో కూడా బీజేపీకి పొత్తులు ఉంటాయని అంతా భావించారు. అదే టైం లో ఎన్డీయే కీలక భేటీకి ఆ పార్టీని కూడా పిలుస్తారు అని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే ఇక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు.
ఎన్డీయే కూటమి సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని చెప్పారు. ఎన్డీయే బలం పెరిగిందని ఆయన చెప్పుకున్నారు. అనేక కొత్త పార్టీలు వచ్చి చేరుతున్నాయని అదంతా ప్రధాని నరేంద్ర మోడీ పాలన చూసి అని అంటున్నారు. జేపీ నడ్డా చెప్పిన పార్టీలు చూస్తే జనసేన మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి ఉంది. తెలుగుదేశం లేదు. దాన్ని బట్టి చూస్తే తమకు మిత్రులు పెరుగుతున్నారని చెప్పడంతో పాటు తాము కోరుకున్న పార్టీలనే ఎన్డీయే మీట్ కి పిలిచామని కూడా నడ్డా చెప్పారని అంటున్నారు.