Begin typing your search above and press return to search.

అమిత్ షాతో భేటీ అద్భుతం అన్న పవన్...ఏం మాట్లాడుకున్నారు..?

By:  Tupaki Desk   |   19 July 2023 8:18 PM GMT
అమిత్ షాతో భేటీ అద్భుతం అన్న పవన్...ఏం మాట్లాడుకున్నారు..?
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి భేటీ అయ్యారు. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఇద్దరి మధ్యన చర్చలు జరిగాయి. అనంతరం బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చలు అద్భుతం అని తన ట్విట్టర్ నుంచి ట్వీట్ చేశారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు.

పవన్ ఈ మాటలు వాడారు అంటే అమిత్ షా ఆయనకు కచ్చితమైన హామీ ఇచ్చి ఉంటారని అంటున్నారు. అలాగే జనసేన ఏపీలో వైసీపీని గద్దె దించాలని అనుకుంటోంది. అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోరాదని కోరుకుంటోంది.

అందుకోసం భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటోంది. ఆ విధంగా ఆలోచిస్తే టీడీపీతో పొత్తు అన్నది పవన్ కోరుకుంటున్నారు. మరి బీజేపీ అయితే ఎన్డీయే మీటింగ్ కి టీడీపీని పిలవలేదు. ఇది ఒక కీలకమైన సంకేతంగానే ఉంది. పవన్ సైతం ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ బీజేపీల మధ్య అండర్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయని అన్నారు.

అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అని అందరికీ తెలుసు. మరి అమిత్ షా భేటీ అద్భుతం అని పవన్ అంటున్నారు అంటే ఆయన టీడీపీ తో పొత్తు విషయంలో అందరూ కలసి ఒక కూటమిగా ఏర్పడే విషయంలో కచ్చితమైన హామీని ఏదైనా పవన్ కి ఇచ్చారా అన్నది చర్చగా ఉంది.

ఇక ఏపీకి ఒక విడత టూర్ చేసి వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడిన అమిత్ షా కూడా ఏపీలో ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు. అయితే మారే ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరాలని గతంలో మాదిరిగా పక్క వాయిద్యంగా ఉండకుండా కీలక శక్తిగా ఉండాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు.

ఇపుడు అమిత్ షా పవన్ ల మధ్య జరిగిన చర్చలు ఏపీ భవిష్యత్తు కోసం అని జనసేన వర్గాలు అంటున్నాయి. వైసీపీ ఓటమే ఏపీకి భవిష్యత్తు అని పవన్ చాలా సార్లు అన్నారు. సో ఆ విధంగా చూస్తే బీజేపీని కూటమి దారిలోకి పవన్ నడిపిస్తున్నారా అన్నదే ఆలోచింపచేసే అంశంగా ఉంది. చూడాలి మరి ఈ అద్భుతం అన్న చర్చల పర్యవసానాలు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయో.

ఇంకో వైపు ఈసారి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ కూడా తన రాజకీయ స్టాండ్ మార్చుకుంటుంది అని అంటున్నారు. ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ ఇష్యూలో వైసీపీ అయితే ఎట్టి పరిస్థితులలో మద్దతు ఇవ్వదని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులకు మరింత సానుకూలత అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.