'బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు'... జగన్ కి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగులు చేసిన వారి అరెస్టుల గురించిన చర్చ జరుగుతుంది.
By: Tupaki Desk | 10 Nov 2024 10:17 AM GMTప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మూడు ఆరోపణలు, ఆరు కేసులు, తొమ్మిది అరెస్టులు అనే సందడి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై చర్చలు జరగ్గా.. తర్వాత మహిళలపై జరిగిన హత్యాచారాలపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగులు చేసిన వారి అరెస్టుల గురించిన చర్చ జరుగుతుంది.
అవును... హోంమంత్రే కాకుండా.. ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మిగిలిన శాఖ మంత్రులతో పాటు చిన్నా చితకా నేతలు కూడా ఇప్పుడు కేసులు, అరెస్టుల గురించి వ్యాఖ్యానిస్తున్నారు! ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై స్పందించిన జగన్... ప్రతీ ఏపీ పోలీస్ అధికారికి చెబుతున్నా.. న్యాయాన్ని గౌరవించండి అని సూచించారు.
అనంతరం... న్యాయాన్ని గౌరవించండి.. ధర్మాన్ని కాపాడండి.. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని దగ్గరుండి బయటకు తీస్తాం.. డిప్యూటేషన్ పై పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినా.. సప్తసముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం.. అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.
ఈ క్రమంలో... తమది మంచి ప్రభుత్వమే కానీ, మెతక ప్రభుత్వం కాదని చెబుతూ డిప్యుటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్... మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని.. ఘోరమైన తప్పిదాలు చేయించారని పవన్ విమర్శించారు.
అనంతరం... మాజీ సీఎం అయినా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.. మీకు బాధ్యత ఉండాలి.. సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బారయుడిని, రిటైర్ అయినా వదలబోమని డీజీపీని ఉద్దేశించి అన్నారు.. వారిపై చిన్న ఈగ వాలినా మీరే బాధ్యత వహించాలి అని పవన్ అన్నారు.
దీంతో... తప్పుడు కేసులు పెట్టే పోలీసు అధికారులను వదిలిపెట్టమంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ కి పవన్ స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారనే చర్చ మొదలైంది. ఈ సందర్భంగా పోలీసు అధికారులపై గతంలో పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, హడావిడిలు తెరపైకి వస్తున్నాయి.
ఏది ఏమైనా... జగన్ వ్యాఖ్యలకు పవన్ మాత్రం తగ్గేదే లే అంటూ విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగానే "మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు" అంటూ జగన్ ని ఉద్దేశించి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు! ఇదే సమయంలో... షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం చెప్పారు.