పవన్ కళ్యాణ్ అలిగారా...!?
ఆయన మదిలో ఏముందో తెలియదు కానీ తన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Jan 2024 1:30 PM GMTజనసేన అధినేత పవన్ అలికిడి రాజకీయంగా ఇటీవల కాలంలో వినిపించడంలేదు. పవన్ అంటేనే రాజకీయ సందడిగా ఉంటుంది. అలాంటి పవన్ ఇంటర్నల్ మీటింగ్స్ కి పరిమితం అవుతున్నారు. ఆయన ఇటీవల కాకినాడలో మూడు రోజులు ఉన్నా మీడియాలో ఏమీ కనిపించలేదు. పవన్ అంత సైలెంట్ అయిపోయారు. ఆయన మదిలో ఏముందో తెలియదు కానీ తన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటున్నారు అని అంటున్నారు.
ఎన్నికలు ముంగిట పెట్టుకుని ఇలా ఎందుకు చేస్తున్నారు అనంది ప్రశ్నగా ఉంది. దానికి జవాబు లాంటి ప్రచారం కూడా సాగుతోంది. పవన్ ఆలోచనలకు పొత్తు పార్టీ తెలుగుదేశం ఎక్కడా పడనివ్వడం లేదని టాక్ అయితే నడుస్తోంది. ఇంతకీ పవన్ ఏమి చెప్పారు, టీడీపీ నుంచి ఎందుకు స్పందన రావడంలేదు అంటే అది చిన్న మాట లాంటిది అయినా పెద్ద మ్యాటరే.
పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీ వైపు ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి చూడగానే గట్టిగా ఆరు నెలలు తిరగకుండానే బీజేపీతో పొత్తులకు వెళ్లారు. అలా గత నాలుగేళ్ళుగా బీజేపీతో బంధం కొనసాగుతోంది. గత ఏడాది నుంచి తెలుగుదేశం బంధం కూడా ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏంటి అంటే బీజేపీ జనసేన టీడీపీ 2014 మాదిరిగా కలసి పోటీ చేయాలని. ఆ విషయమే ఆయన చెబుతున్నారు. బీజేపీతో పోదామని పవన్ అంటూంటే దాని మీద చంద్రబాబు కానీ లోకేష్ కానీ అసలు పలకడం లేదని అంటున్నారు.
బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్న నేపధ్యంలో ఆ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్తే కేంద్రంలో కూడా కూటమికి వెయిట్ ఉంటుందని పవన్ భావిస్తూ అదే చెబుతూ వస్తున్నారుట. అయితే టీడీపీ నుంచి దానికి పెద్దగా స్పందన రావడం లేదు అని అంటున్నారు.
కేంద్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్నా బీజేపీ ఏపీకి చేసింది ఏమీ లేదని అందువల్ల బీజేపీతో వెళ్తే ఏపీలో ఆ వ్యతిరేక ప్రభావం గట్టిగా పడి టీడీపీ కూటమికి ఓట్ల శాతం బాగా తగ్గుతుంది అన్నది టీడీపీ పెద్దల ఆలోచన అని అంటున్నారు. పైగా ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు ఏపీకి గుండు సున్నా చేసింది అని జనాలలో భావన ఉంది.
కేంద్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీకి ఉన్న యాంటీ ఇంకెంబెన్సీ కూడా తమ తలకు చుట్టుకుంటుందని టీడీపీ విశ్లేషణగా ఉందిట. ఇక మైనారిటీలు దళితుల ఓట్లు కూడా తమకు దక్కకుండా పోతాయి అన్న బెంగ ఎటూ ఉందిట. ఇలా చాలా లెక్కలు వేసుకుని టీడీపీ బీజేపీ విషయంలో ఆలోచిస్తోంది అని అంటున్నారు. అయితే ఈ లెక్కలు ఏవీ పవన్ కి అర్ధం కావని అందుకే ఆయన బీజేపీతో పొత్తు అని అంటున్నారు అన్నది టీడీపీ వైపు నుంచి వస్తున్న వాదనగా ఉంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం రెండు వైపుల నుంచి కలపాలని చూస్తున్నారు. అటు బీజేపీ వారికి చెప్పాల్సింది చెబుతున్నారు. ఇటు టీడీపీని బీజేపీతో పొత్తు కోసం రావాలని కోరుతున్నారు. బీజేపీ వారి వద్దకు నాదెండ్ల మనోహర్ ని పంపించి తాము చెప్పాల్సింది వారికి చెప్పారు పవన్. దాని మీద బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా రియాక్ట్ అయ్యారు. పొత్తులు అన్నీ కేంద్ర నాయకత్వమే చూస్తోందని అక్కడికే విన్నపాలు వెళ్లాలని చెబుతూ ఆయన పవన్ ప్రతిపాదనలకు ఇండైరెక్ట్ గా ఓకే చెప్పారు.
అయితే టీడీపీ విషయంలోనే అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీ ఏపీలో కొత్త పొత్తులకు తెర తీసేలా కనిపిస్తోంది అని అంటున్నారు. బీజేపీని దూరంగా పెట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు కలిపి ముందుకు పోవాలన్నది టీడీపీ నయా వ్యూహం అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తుకు కూడా టీడీపీ నేతలు చాలా మంది నో చెబుతున్నారని టాక్.
ఇలా టీడీపీలో సీన్ ఉంది. దాంతో పవన్ గత వారంగా టీడీపీ నేతలతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ అలిగారు అని అంటున్నారు ఈ అలకల పర్వంలో ఇది మొదటిది ఇంకా చాలానే ఉండొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఎందుకంటే టీడీపీ ఎత్తులు ఏ రోజు కా రోజు మారుతున్న వేళ పవన్ మరిన్ని ఇలాంటివి చూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.