Begin typing your search above and press return to search.

పవన్ ప్రయారిటీ పోలవరం.. లోకేశ్ ప్రాధాన్యత అన్నక్యాంటీన్లు

అదేమంటే చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ ఆసక్తులు.. ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపై ఒకింత ఆసక్తి వ్యక్తమైంది.

By:  Tupaki Desk   |   25 Jun 2024 5:33 AM GMT
పవన్ ప్రయారిటీ పోలవరం.. లోకేశ్ ప్రాధాన్యత అన్నక్యాంటీన్లు
X

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలిసారి మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని చర్చించారు. ఈ మొత్తం సమావేశం ఒక ఎత్తు అయితే.. ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాల్ని చూస్తున్నప్పుడు ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. అదేమంటే చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ ఆసక్తులు.. ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపై ఒకింత ఆసక్తి వ్యక్తమైంది.

ఈ ఇద్దరు నేతలు మంత్రివర్గంలో ఏయే అంశాల్ని ప్రస్తావించారు? వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నది చూసినప్పుడు.. ఇద్దరి ప్రాధాన్యతలు భిన్నంగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. కేబినెట్ భేటీలో పోలవరం నిర్మాణం.. దానికి సంబంధించిన అంశాల మీద పవన్ కల్యాణ్ ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు.

పోలవరం పురోగతి ఎలా ఉందన్న పవన్ ప్రస్తావనకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ నెలాఖరు నాటికి కేంద్ర జలశక్తి శాఖ నియమించిన అంతర్జాతీయ నిపుణుల టీం రాష్ట్రానికి వస్తుందని.. వారి అధ్యయన రిపోర్టు ఆధారంగా పనులు చేపట్టాలన్న విషయాన్ని వెల్లడించారు.

పోలవరం గురించి పవన్ ప్రస్తావిస్తే.. మంత్రి లోకేశ్ మాత్రం అన్న క్యాంటీన్ల అంశంపై తన ఆలోచనల్ని షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఒక ట్రస్టు ను ఏర్పాటు చేస్తే విరాళాలు వస్తాయని.. వాటి ద్వారా పేదలకు భోజన వసతిని నిరాటంకంగా నిర్వహించొచ్చన్న విషయాన్ని పేర్కొనగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.

తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి ట్రస్టు ఏర్పాటు చేసిన తరహాలోనూ అన్న క్యాంటీన్ల నిర్వహణను చేపట్టాలన్న తన ఆలోచనను బయటపెట్టారు. దీనికి సానుకూలత వ్యక్తమైంది. అదే సమయంలో ఈ అంశంపై పవన్ స్పందించారు. అన్న క్యాంటీన్లను వినియోగించే వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులే అన్న విషయాన్ని ప్రస్తావించారు. వారిని భాగస్వామ్యుల్ని చేయాలని నిర్ణయించారు. మొత్తంగా చూస్తే.. పోలవరం మీద పవన్.. అన్న క్యాంటీన్ల మీద లోకేశ్ ఎక్కువ ఫోకస్ పెట్టారన్న అభిప్రాం వ్యక్తమవుతోంది.