ఫుల్ రిలాక్స్ మూడ్ లో జనసేనాని...మ్యాటరేంటి...?
ఏణ్ణర్ధం క్రితం ఇప్పటం లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
By: Tupaki Desk | 24 Oct 2023 11:30 PM GMTపార్టీ పెట్టాక ఎన్నికల్లో పోటీ చేశాక జనసేన పవన్ కళ్యాణ్ ఎపుడూ ఇంతటి రిలాక్స్ మూడ్ లో లేరని అంటున్నారు. తెలుగుదేశం తో పొత్తు ఉంటుందని చూచాయగా పవన్ చాలా కాలం క్రితమే చెప్పినా టీడీపీ దోబూచులాటలతో కొంత ఇబ్బంది పడుతూ వచ్చింది జనసేన. పొత్తు కుదురుతుంది కానీ తాము బేరం పెట్టే సీట్లు వస్తాయా రావా అన్నది జనసేనాని ఆలోచనలు అని అంటూ ప్రచారం సాగింది.
ఏణ్ణర్ధం క్రితం ఇప్పటం లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆ పొత్తుల కధ తీరం చేరడానికి చాలా కాలమే పట్టింది. ఇపుడు కూడా చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే టీడీపీ తో పొత్తు ఇంత తొందరగా సజావుగా కుదిరేది కాదు అని అంటున్నారు.
చంద్రబాబు జైలు పాలు కావడం, టీడీపీ కొంత సంక్షోభంలో కూరుకుని పోవడంతో పవన్ కళ్యాణ్ కి అనూహ్యమైన చాన్స్ వచ్చింది అని అంటున్నారు. అందుకే ఆయన చాలా స్పీడ్ గా పొత్తు కధను ముందుకు నడిపారు. దానికి జనసేన నుంచి వచ్చిన అభ్యంతరాలు కానీ వైసీపీ చేసే విమర్శలు వచ్చిపడినా పవన్ లెక్కచేయలేదు.
ఈ విషయంలో ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన టీడీపీతో పొత్తును త్వరగా అనౌన్స్ చేయడంతో రెండిందాలా ప్రయోజనం కోరుకున్నారు. మొదటిది అయితే టీడీపీ కష్టకాలంలో పొత్తు పేరుతో బాసటగా నిలిచారు నిజమైన మిత్రుడు అన్నది అయితే రెండవది ఇంతటి కీలక సమయంలో మద్దతు ఇవ్వడం ద్వారా జనసేన కోరుకుంటున్న సీట్లను పొందడం.
చంద్రబాబు అరెస్ట్ కి ముందు పరిస్థితులు వేరు. టీడీపీ జనసేనకు కనీసంగా పదిహేను నుంచి మొదలెట్టి ఏ ఇరవై సీట్లకో పరిమితం చేయాలని చూస్తోందని వార్తలు వచ్చాయి. ఇపుడు అలా కాకుండా కనీసం దానికి డబుల్ సీట్లు అంటే నలభై సీట్లు కచ్చితంగా సాధించవచ్చు అన్న నమ్మకం అయితే పవన్ లో ఉంది అంటున్నారు. అంతే కాదు అనుకున్నట్లుగా పొత్తు కధ ముందుకు పూర్తి స్థాయిలో సాగితే యాభై సీట్లు అయినా జనసేన సాధిస్తుంది అని అంటున్నారు.
ఇక పవన్ లోకేష్ మీడియా సమావేశంలో లోకేష్ కు మీడియా ఒక సంక్లిష్ట ప్రశ్నే అడిగింది. కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అని. దానికి లోకేష్ ఇవన్నీ కాదు ముందు వైసీపీని ఓడించడం ఏపీని కాపాడడం మాత్రమే లక్ష్యం అని అన్నారు. అంటే చంద్రబాబు సీఎం అని కుమారుడు అయిన లోకేష్ చెప్పలేకపోయారు అని అంటున్నారు.
అది ఒక విధంగా పవన్ సాధించిన విజయంగానే చూస్తున్నారు. కూటమిలో సీఎం అభ్యర్ధి ఎవరు అని ఎన్నికల దాకా ప్రకటించకుండా ఉంటే కచ్చితంగా పవన్ వ్యూహం గెలుస్తుంది. జనసేనకు సీఎం అవకాశాలు పెరుగుతాయి. అదే విధంగా ఆయన సామాజిక వర్గం దన్నుగా నిలుస్తుంది. ఇక యాభై సీట్లను కనుక పొత్తులో తీసుకుంటే రేపటి రోజున జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి పవన్ వ్యూహం మరో మారు దోహదపడుతుంది.
ఇదిలా ఉంటే రాయలసీమ రీజియన్ లో ఉన్న మొత్తం 52 సీట్లలో జనసేన పది సీట్లను కోరుతోందని వార్తలు వస్తున్నాయి. ఆయా సీట్లని కూడా వివరిస్తూ జనసేన ప్రతిపాదనలు పంపించింది అని అంటున్నారు నిజానికి చూస్తే రాయలసీమలో జనసేనకు పెద్దగా బలం లేదని అంటారు. అక్కడే పది సీట్లు అందునా 52 ఉన్న చోట పది సీట్లు కోరారు అంటే మిగిలిన 123 సీట్లలో మరో నలభై సీట్లు ఈజీగా కోరుతారు అని అంటున్నారు.
మొత్తానికి జనసేన టీడీపీ తొలి కో ఆర్డినేషన్ మీటింగ్ టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ దీంతో పూర్తిగా రిలాక్స్ గా ఉన్నారని అంటున్నారు. ఈసారి మంచి నంబర్ తో జనసేన నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఎంపీ సీట్లు కూడా కనీసంగా ఏడుకు తగ్గకుండా జనసేన తీసుకుంటుందని అలా పార్లమెంట్ లో జనసేన ప్రాతినిధ్యం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ పొత్తుల వల్ల జనసేన బాగానే లాభపడుతుందని అంటున్నారు.