త్యాగమూర్తివయ్యా పవనూ... బీజేపీ కోసం సీట్ల కోత...!
తాను కేంద్రంలోని బీజేపీ పొత్తు కోసం తెగ ఆరాట పడ్డాను అని ఇటీవల తన పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ చెప్పుకొచ్చారు
By: Tupaki Desk | 9 March 2024 12:35 PM GMTతాను కేంద్రంలోని బీజేపీ పొత్తు కోసం తెగ ఆరాట పడ్డాను అని ఇటీవల తన పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు బీజేపీ జాతీయ నాయకత్వం తో చీవాట్లు కూడా తిన్నాను అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇంత చేసింది దేని కోసం ఏపీ కోసం పొత్తుల కోసం అని ఆయన పార్టీ వారిని తన మనసులో మాటను వినిపించారు.
బీజేపీతో పొత్తు కోసం పవన్ పడిన తపన అదన్న మాట. మరి అంతలా తపన పడిన పవన్ ఇంకా త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. గత నెల 24న చంద్రబాబు పవన్ కలసి తొలి విడత జాబితాను ప్రకటించారు. ఆ సమయంలో కూడా తాను కేవలం 24 సీట్లను తీసుకుంటున్నాను అంటే బీజేపీ కోసం అన్నారు. బీజేపీకి కూడా సీట్లు ఇవ్వాల్సి రావడం వల్లనే తాను సీట్లు తగ్గించుకున్నాను అని ఆయన చెప్పారు.
ఇక మరో వైపు చూస్తే ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ భేటీ అయి పొత్తుల మీద కీలక చర్చలు జరిపారు. ఈ చర్చలలో భాగంగా బీజేపీ తాను కోరిన ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే ఇవ్వాలని టీడీపీ అనుకుందని వార్తలు ఉన్నాయి. అయితే బీజేపీ పెద్దలు పట్టుబట్టడంతో ఇక ఆ సంఖ్యను అయిదుకు పెంచారు. కానీ బీజేపీ పెద్దలు తగ్గకపోవడం జరిగింది అని అంటున్నారు.
బీజేపీ పెద్దలు పది ఎంపీ సీట్లు అని పట్టు బట్టి దాన్ని ఎనిమిదిగా ఫిక్స్ చేయమని కోరి చివరిని ఆరుకు ఫిక్స్ అయ్యారని టాక్. అయితే ఆ ఆరో ఎంపీ సీటు మాత్రం టీడీపీ తన కోటాలో నుంచి ఇవ్వలేదు అని అంటున్నారు. జనసేనకు ఇప్పటికే ఇచ్చిన మూడు ఎంపీ సీట్ల నుంచి కోత విధించి ఆ సీటుని ఇచ్చి ఆరుకు బీజేపీ పెద్దలు అంగీకరించేలా చంద్రబాబు చేసుకున్నారని అలా బాబు చాణక్య రాజకీయం చూపిస్తే పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి అయ్యారు అని అంటున్నారు.
ఇది ఇక్కడితో ఆగలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ముందు ఇచ్చినట్లుగా చంద్రబాబు చెప్పినవి 24 ఎమ్మెల్యే సీట్లు. ఇపుడు అందులో కూడా కోత పడబోతోంది అని అంటున్నారు. బీజేపీకి ఆరు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అనుకున్నారు. కానీ బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలని కోరడంతో జనసేన నుంచే ఆ రెండు సీట్లు కూడా కోత విధించి ఇస్తున్నారు అని మరో ప్రచారం సాగుతోంది. అంటే బీజేపీతో పొత్తు మూలంగా పవన తన 24 ఎమ్మెల్యే సీట్లలో రెండు, మూడు ఎంపీ సీట్లలో ఒకటి కోల్పోతున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే బీజేపీ జనసేనలకు కలిపి ముప్పయి ఎమ్మెల్యే ఎనిమిది ఎంపీ సీట్లతో తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంది అని అంటున్నారు. ఈ పొత్తుతో టీడీపీ మొత్తం 145 సీట్లలో సోలోగా తాను పోటీ చేస్తుంది అన్న మాట. ఇదీ విషయం.