కేంద్రంలో మంత్రి పదవి.. పవన్ ఎందుకు తగ్గారు? మిలియన్ డాలర్ల ప్రశ్న!
ప్రస్తుతం కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి కూటమి పార్టీల దన్ను అత్యంత కీలకమనే విషయం తెలిసిందే
By: Tupaki Desk | 15 Jun 2024 3:00 AM GMTప్రస్తుతం కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి కూటమి పార్టీల దన్ను అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 సీట్లే వచ్చాయి. వాస్తవ మేజిక్ ఫిగర్ ప్రకారం.. మరో 32 స్థానాలు ఉండాల్సి ఉంది.దీంతో ఎన్డీయే కూటమి పక్షాలైన అప్నాదళ్, జేడీయూ, టీడీపీ, షిండే శివసేన, జనసేన, జేడీఎస్ సర్కులర్ వంటి పార్టీలతో జత కట్టి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే. వీటిలోనూ.. టీడీపీకి 16 సీట్లు, జేడీయూకు 12, జేడీఎస్‌కు 2 సీట్లు, అప్పాదళ్ పార్టీకి 1 సీటు మాత్రమే దక్కాయి. ఇక, షిండే శివసేన పార్టీకి మాత్రం 7 స్థానాలు వచ్చాయి. మరో పార్టీ జనసేనకు 2 స్థానాలు వచ్చాయి.(పోటీ చేసింది రెండు సీట్లు)
అయితే.. కేంద్ర కేబినెట్లో మాత్రం పార్లమెంటులో ఒక సీటు, రెండు సీట్లు దక్కించుకున్న పార్టీలకు కూడా.. మోడీ ప్రాధాన్యం ఇచ్చారు. వారికి కేంద్రం పదవులు కూడా కట్టబెట్టారు. అప్నాదళ్ నుంచి ఆపార్టీ చీఫ్ అనుప్రియ పటేల్ ఒక్కరే విజయం దక్కించుకున్నారు. ఆమెకు కేంద్రంలో పదవి ఇచ్చారు. ఇలా.. ఒకటి రెండు స్థానాలు దక్కించుకున్న పార్టీలకే మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నప్పుడు.. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం దక్కించుకున్నా.. ఒక్క కేబినెట్ సీటు కూడా ఎందుకు దక్కలేదు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ సాగుతోంది.
అంతేకాదు.. కూటమి కట్టడంలోనూ.. బీజేపీ నెగ్గడంలోనూ ఏపీలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ఆయనే రెండు మూడు సందర్భాల్లో ఈవిషయాన్ని చెప్పుకొచ్చారు. కూటమి కట్టేందుకు తాను అనేక మాటలు పడ్డానని.. వెయిట్ చేశానని అన్నారు. ఇది నిజమే. మరి ఇంత గా కష్టపడి కూటమి ని గెలిపించిన పవన్ కల్యాణ్ పార్టీకి కేంద్రంలో ప్రాధాన్యం లేక పోవడం చర్చనీయాంశమే. అయితే. పవనే పదవులు వద్దన్నారని ఒక టాక్ వినిపిస్తోంది. మోడీ ఇచ్చేందుకు రెడీ అయినా.. ఇప్పుడే వద్దని పవన్ వారించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరింత బలంగా ఎదిగిన తర్వాత.. అప్పుడు చూసుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం.
మరో వైపు.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపైనే పవన్ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న దరిమిలా.. కేంద్రంలో ఇప్పుడే పదవులు తీసుకోవడం బాగోదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేపు టీడీపీ అధ్యక్షపగ్గాలు మారి.. నారా లోకేష్‌కు కనుక పార్టీ పదవి.. అదేసమయంలో వచ్చే ఎన్నికల తర్వాత.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. అప్పుడు పవన్ కల్యాణ్ కేంద్రంలో మంత్రిగా పదవి చేపట్టే అవకాశం ఉందని.. తద్వారా కూటమి పార్టీ అయిన టీడీపీకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో పవన్ జాగ్రత్తపడి ఉంటారన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి పవన్ కనుక అడిగి ఉన్నా.. లేక మోడీ ఇస్తానంటే తీసుకుని ఉన్నా.. ఆపార్టీకి కూడా.. ఒక కేంద్ర మంత్రి పదవి మాత్రం దక్కి ఉండేదనడంలో సందేహం లేదు.