మరో కీలక పదవిపై కన్నేసిన జనసేన?... పవన్ వ్యాఖ్యలు వైరల్!
ఈ క్రమంలో స్పందించిన పవన్... డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2024 5:04 AM GMTఏపీలో నూతన ప్రభుత్వం అసెంబ్లీ కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
మరోపక్క ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి, ఏ పార్టీకి దక్కనుందనేది ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఈ పదవి టీడీపీనే ఉంచుకునే అవకాశాలున్నాయనే కామెంట్లూ వినిపిస్తుంది. ఇందులో భాగంగా.. మంత్రి పదవులు దక్కని పలువురు సీనియర్లను తృప్తిపరిచే క్రమంలో భాగంగా ఈ పదవి తమవద్దే ఉంచుకునేలా బాబు భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పలువురు సీనియర్ల పేర్లూ తెరపైకి వస్తున్నాయి.
మరోపక్క ఈ పదవి కోసం అటు బీజేపీ, ఇటు జనసేనలు కూడా పోటీ పడుతున్నాయని.. అంటున్నారు. ఇప్పటికే బీజేపీ మరో మంత్రి పదవి ఆశిస్తుందని.. ఆ పదవి దక్కని పక్షంలో డిప్యూటీ సీఎం అయినా ఇవ్వాలని పట్టుబడుతుందని అంటున్నారు. ఇదే సమయంలో... జనసేన కూడా ఈ పదవిని ఆశిస్తుందనే చర్చ గతకొంతకాలంగా నడుస్తుంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారు.
అవును... ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏకగ్రీవం అవ్వడం, అందుకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న ఎంపికవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పోస్టుపై జనసేన కన్నేసిందని అంటున్నారు. ఫలితంగా సభాపతుల విషయంలో సమాన అవకాశాలు తీసుకున్నట్లు ఉంటుందని పవన్ & కో భావిస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో స్పందించిన పవన్... డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇదే సమయంలో అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని కూడా తమ పార్టీనే తీసుకునే అవకాశం ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎదుర్కొనే న్యాయపరమైన అంశాల్లో ఈ పదవి ఎంత కీలకం అనేది తెలిసిన విషయమే!
ఇక, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా చట్టాల రూపకల్పన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని అంశాలపైనా లోతుగా సభలో విశ్లేషణలు చేస్తామని పవన్ తెలిపారు. ఈ క్రమంలోనే... అటు డిప్యూటీ స్పీకర్, ఇటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులపై స్పందించారు.