స్పీకర్ గా అయ్యన్న...పవన్ కామెంట్స్ వైరల్ !
దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్పీకర్ చెయిర్ లో కూర్చున్నారు కదా ఇక మీదట మీరు ఆ విధంగా మాట్లాడే చాన్స్ లేదని పవన్ సరదాగా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 22 Jun 2024 10:16 AM GMTరాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ 16వ శాసనసభకు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆయనను చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలసి స్పీకర్ కుర్చీలో ఆసీనులను చేశారు. ఈ సందర్భంగా అయ్యన్నను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయ్యన్న అంటే ఫైర్ బ్రాండ్. ఆయన ఆవేశపూరితంగా మాట్లాడుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్పీకర్ చెయిర్ లో కూర్చున్నారు కదా ఇక మీదట మీరు ఆ విధంగా మాట్లాడే చాన్స్ లేదని పవన్ సరదాగా వ్యాఖ్యానించారు.
పైగా మీ నుంచి కొత్తదనాన్ని సరికొత్త హుందాతనాన్ని జనాలు చూడబోతున్నారు అని పవన్ అన్నారు. తన చిన్నప్పుడు స్కూల్ లో ఎవరైతే బాగా అల్లరి చేస్తారో వారిని తీసుకెళ్ళి క్లాస్ పీపుల్ లీడర్ చేసేవారు అని ఇపుడు అయ్యన్న తమందరికీ లీడర్ అయ్యారని చమత్కరించారు.
అయ్యన్న వాడీ వేడి ఇక మీదట కనిపించకూడదన్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద పవన్ ఇచ్చిన ఈ స్పీచ్ తో సభలో నవ్వులు పూయించారు. అయ్యన్న సైతం మనసారా నవ్వుకున్నారు. పవన్ తన తొలి స్పీచ్ లోనే అసెంబ్లీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అంతే కాదు సభ ఎలా ఉండకూడదు అన్న దానికి గత సభ నిదర్శనం అయితే ఎలా ఉండాలి అన్న దానికి ఈ సభ కొలమానం కావాలని అన్నారు.
ఇక అయ్యనది కొత్త అవతారం అని మంత్రి సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. అయ్యన్నలో ఇక నుంచి కొత్తదనాన్ని ఆశిస్తామని చెప్పారు. అయ్యన్న సుదీర్ఘ అనుభవంతో సభలో మంచి సంప్రదాయాలను నెలకొల్పాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. మొత్తం మీద చూస్తే అయ్యన్నపాత్రుడు తనదైన ఆవేశంతో మాట్లాడేస్తూ ఉంటారు.
కానీ ఇపుడు ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. దానిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గత స్పీకర్ ఎక్కువగా రాజకీయాలు మాట్లాడేవారు. కానీ అయ్యన్న ఇక మీదట రాజకీయాల జోలికి వెళ్ళకుండా స్పీకర్ గా తన విధులను నిర్వర్తించాలని అంతా ఆశిస్తున్నారు.
అయ్యన్నకు ఇవే చివరి ఎన్నికలు. రాజకీయాల్లో ఆయన చాలా చూసారు. దాంతో రాజకీయాలు అన్నది ఆయన కుమారులకు అప్పగించి ఆయన పదవికి వన్నె తేవాలని కోరుకుంటున్నారు. అయ్యన్న సైతం తాను తక్కువ మాట్లాడుతాను అని ఎమ్మెల్యేలకు ఎక్కువ మాట్లాడే చాన్స్ ఇస్తామని స్పీకర్ గా తన పనితీరుని ప్రజలు అంతా మెచ్చుకునేలా వ్యవహరిస్తాను అని అంటున్నారు.