Begin typing your search above and press return to search.

పవన్ కోసం తమ్ముళ్ల త్యాగాల వెనుక బాబు ప్లాన్ ఇదేనట!

ఈ సమయంలో పవన్ పోటీ చేయబోయే స్థానలపై చంద్రబాబు ఒక సూచన చేశారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 9:50 AM GMT
పవన్  కోసం తమ్ముళ్ల త్యాగాల వెనుక  బాబు ప్లాన్  ఇదేనట!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే ఏపీలో అన్ని ప్రధాన పార్టీలకూ ఈ దఫా ఎన్నికలు లైఫ్ & డెత్ ఇష్యూ వంటివనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పులు, చేర్పులు చేపట్టిన జగన్... ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. "సిద్ధం" అంటూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. మరో పక్క టీడీపీ సైతం ప్రచారలు మొదలుపెట్టేసింది. ఈ సమయంలో ప్రధానంగా టీడీపీ - జనసేన మధ్య సీట్ల సర్దుబాటుతో పాటు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం పైనా తీవ్ర చర్చ నడుస్తుంది.

ఈ సమయంలో పవన్ వచ్చే ఎన్నికల్లో ఏ స్థానాల్లో పోటీ చేయాలి.. ఒకచోట పోటీ చేయాలా, రెండు చోట్ల పోటీచేయాలా అనే చర్చ కూటమిలో కూడా నడుస్తుందని అంటున్నారు. మరోపక్క అసలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలిసే... అప్పుడు పవన్ ఎక్కడ, ఎన్ని చోట్ల పోటీ చేస్తారనే విషయంపై ఒక స్పష్టతకు రావొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో... జనసేన మాత్రం 40 స్థానాలకు తగ్గకుండా పోటీచేయాలని అటు జనసైనికులు, ఆ పార్టీ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

మరోపక్క చంద్రబాబు మాత్రం పాతిక లోపు తెగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు! ఇప్పటికే మూడు లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తున్న నేపథ్యంలో... అవి అక్కడితో కట్టిపెట్టి, అసెంబ్లీ సీట్లు మాత్రం 20 - 25 మధ్యలో మాత్రమే కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పైగా మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ ఎంట్రీపైనా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అంటున్న నేపథ్యంలో... ఆ క్లారిటీ అనంతరమే సీట్ల కేటాయింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సమయంలో పవన్ పోటీ చేయబోయే స్థానలపై చంద్రబాబు ఒక సూచన చేశారని తెలుస్తుంది. వాస్తవానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే స్థానంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో మరోసారి పవన్ పోటీచేసి పోగొట్టుకున్న చోటే సాధించాలని పలువురు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే... పవన్ మాత్రం వీలైనంత సేఫ్ గేం ఆడాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో ఒకటైన భీమవరం నుంచి పవన్ పోటీచేయాలని బాబు సూచించారని అంటున్నారు. ఇదే సమయంలో మరో చోట కూడా పోటీ చేయాలని సూచిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా పవన్ పోటీ చేయబోయే రెండో స్థానం ఉత్తరాంధ్ర కాకుండా... ఈసారి రాయలసీమ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని బాబు సూచించారని తెలుస్తుంది. అదే జరిగితే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గల్లో అనంతపురం, తిరుపతిల్లో ఏదో ఒకటి కన్ ఫాం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా... టీడీపీ నుంచి అనంతపురం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. పవన్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను స్వచ్చందంగా తప్పుకుంటానంటు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన త్యాగం వెనుక కూడా బాబు వ్యూహం ఉందని అంటున్నారు. రాయలసీమలో జగన్ హవాను ఎంతో కొంత తగ్గించడానికి పవన్ ఉపయోగపడతాడనేది బాబు ఆలోచన అని చెబుతున్నారు. ఇప్పటికే అనంతరపురం జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేస్తున్నా... వైసీపీపై ఆయన చూపించే ప్రభావం ఆల్ మోస్ట్ శూన్యం అనేది పెద్దల అభిప్రాయం అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాయలసీమలోని ఒక కీలక నియోజకవర్గం నుంచి కూడా పవన్ ను బరిలోకి దింపితే... చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ఆ ప్రభావం వర్కవుట్ అయ్యే అవకాశం ఉందని బాబు & కో భావిస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా... బీజేపీతో పొత్తు వ్యవహారంపై క్లారిటీ రాగానే పవన్ పోటీ చేసే రెండు స్థానాలపైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... ఈసారి కూడా పవన్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బరిలోకి దిగే అవకాశాలు లేవని తెలుస్తుంది!