Begin typing your search above and press return to search.

పవన్‌ ఢిల్లీ పర్యటనకు వేళాయె.. కీలక అంశాలు ఇవే!

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు

By:  Tupaki Desk   |   17 July 2024 8:14 AM GMT
పవన్‌ ఢిల్లీ పర్యటనకు వేళాయె.. కీలక అంశాలు ఇవే!
X

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా విరామం ప్రకటించిన ఆయన తన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాను చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, కాలుష్య నియంత్రణ, గ్రామీణ నీటి సరఫరా, శాస్త్రసాంకేతిక శాఖల్లో నిధుల లేమిపై పవన్‌ కళ్యాణ్‌ కొద్ది రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలకు వచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించేసిందని పవన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా సంబంధిత శాఖల మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలపై పవన్‌ కళ్యాణ్‌ చర్చిస్తారని తెలుస్తోంది. నిధులు విడుదల చేయాలని కోరనున్నారు.

అదేవిధంగా కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సత్కార కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ హృదయంలో తనకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని కోరడం, తదితర అంశాలను ఆయన వద్ద ప్రస్తావిస్తానని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పవన్‌ జూలై 19న ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో జలజీవన్‌ మిషన్‌ సమీక్ష సమావేశంలో పాల్గొన నున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో పైపులైన్ల ద్వారా అన్ని గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించాలని పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీటిని అందిస్తామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం జల జీవన్‌ మిషన్‌ కు రాష్ట్ర వాటా నిధులు కేటాయించలేదని.. దీంతో కేంద్రం తన వాటా నిధులు ఆపేసిందని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ శుభ్రమైన తాగునీటిని అందించే అవకాశం ఉండేదని అంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఈ మిషన్‌ ఆగిపోయిందని అధికారుల సమీక్షల్లో పవన్‌ తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న పవన్‌ జలవనరులు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులను కలుస్తారు. నిధులు విడుదల చేయాలని వారిని కోరతారు. అలాగే తాను మంత్రిగా ఉన్న శాఖలకు సంబంధించి అందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని విన్నవిస్తారని తెలుస్తోంది.

అలాగే అవకాశాన్ని బట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కూడా కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ బకాయిలు, తదితర అంశాలపై చర్చిస్తారని చెబుతున్నారు.