డిప్యూటీ సీఎం గా పవన్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కీలక శాఖలను చూడబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం అవును అంటోంది
By: Tupaki Desk | 4 Jun 2024 12:40 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కీలక శాఖలను చూడబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారం అవును అంటోంది. పవన్ ఈసారి ఎన్నికల్లో 21 సీట్లకు మొత్తం తన పార్టీ తరఫున గెలిపించుకున్నారు. తాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. కూటమి విజయానికి ఆక్సిజన్ గా మారారు.
చంద్రబాబు సైతం ఆయన పట్ల పూర్తి అభిమానం కనబరుస్తున్న నేపధ్యం ఉంది. సినీ గ్లామర్ నిండుగా ఉన్న పవన్ కి బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉంది. అదే సమయంలో యువత మొత్తం పవన్ కోసం ఊగిపోయే నేపధ్యం ఉంది.
ఇలా అన్నీ కూడా కలసి పవన్ కూటమి విజయంలో తన వంతు పాత్రను విజయవంతంగా పోషించారు. దానికి గానూ ఆయనకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కి టీడీపీ కూటమి ప్రభుత్వంలో అప్పగించే బాధ్యతలు ఏమిటి అన్న చర్చ కూడా నడుస్తోంది.
అయితే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అతి ముఖ్యమైన పంచాయతీ రాజ్ శాఖతో కూడిన ఉప ముఖ్యమంత్రి పదవి ని ఎంచుకుంటారు అని అంటున్నారు. ఈ శాఖ అంటే చాలా ముఖ్యమైనది. పైగా గ్రామీణ ప్రాంత ప్రజలతో నేరుగా సంబంధం ఉన్నది.
మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శాఖను ఇవ్వడానికి చంద్రబాబు ఏ మేరకు ఒప్పుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో అయితే సముచితమైన స్థానం ఇస్తారు అని అంటున్నారు. మరి పంచాయాతీ రాజ్ శాఖతో డిప్యూటీ సీఎం దక్కుతుందా అంటే కొద్ది రోజులు ఆగితే తేలుతుంది అని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వాంలో ఆయన సీఎం గా ఉంటే పవన్ డిప్యూటీ సీఎం గా ఉండడం అంటే ప్రభుత్వానికే ఒక కళ కడుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండడం అన్నది కొత్త కాదు, 2014లో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇచ్చారు.
ఇపుడు ఆయన పవన్ ఒక్కరికే ఇస్తేనే ఆ పదవికి ఒక అర్ధం అందం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మాత్రం 2024 ఎన్నికల తరువాత కొత్త మలుపు తీసుకోనుంది అన్నది వాస్తవం అంటున్నారు.