పవన్ కళ్యాణ్...సచివాలయం జాబ్స్ ఇచ్చిందే జగన్ !
కానీ ఏమైంది రికార్డు టైంలో వారి కంటే యమ స్పీడ్ గా పెన్షన్లు ఏపీలో పంపిణీ చేశామని పవన్ చెప్పుకున్నారు.
By: Tupaki Desk | 2 July 2024 1:04 PM GMTవాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోయాయా అని జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఏదో అయిపోతుందని భయపెట్టారని ఆయన అన్నారు. కానీ ఏమైంది రికార్డు టైంలో వారి కంటే యమ స్పీడ్ గా పెన్షన్లు ఏపీలో పంపిణీ చేశామని పవన్ చెప్పుకున్నారు.
అయితే పవన్ చెప్పినది చూస్తే వైసీపీని విమర్శించి నట్లుగా లేదు, ఆయన చెబుతున్న మాటలలోనే వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల గురించి ఉందని అంటున్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంచింది ఎవరు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కాదు సచివాలయ ఉద్యోగులే అని గుర్తు చేస్తున్నారు.
వారు ఏపీ మొత్తంగా లక్షా ఇరవై వేల దాకా ఉన్నారని అంటున్నారు. వారు ఒక బలమైన సైన్యంగా క్షేత్ర స్థాయిలో నిలబడబట్టే పెన్షన్ల పంపిణీ అన్నది పూర్తి అయింది అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అలాంటి వ్యవస్థను సృష్టించి ఇచ్చింది వైఎస్ జగన్ కాదా అని ప్రశ్నిస్తున్నారు.
జగనే కనుక తలచుకోకపోతే గ్రౌండ్ లెవెల్ లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండకపోతే కూటమి ప్రభుత్వం పెన్షన్లను ఎవరితో పంపిణీ చేసేది అని ప్రశ్నిస్తున్నారు. అపుడు ఈ రికార్డులు అన్నీ ఉంటాయా అన్ నిలదీస్తున్నారు. ప్రజలకు చేరువగా పాలనను తీసుకుని వచ్చి మేలు చేసింది వైసీపీ అని అంటున్నారు.
అసలు విషయాన్ని ఒప్పుకోకుండా వాలంటీర్లు లేరు కదా అని పవన్ అంటున్నారు అని. వాలంటీర్లతో పాటే సచివాలయ వ్యవస్థను కూడా వైసీపీ హయాంలో ఏర్పాటు చేయబట్టే ఇంత పెద్ద ఎత్తున పంపిణీ సాధ్యపడింది అని అంటున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇళ్ళకు వెళ్ళి ఇస్తున్నారు అని పవన్ చెప్పడంలోనే వైసీపీ ఏమి చేసింది అన్నది ఉందని అంటున్నారు.
ఇంటి వద్దకే పాలన అన్నది వైసీపీ విధానమని దాని పునాదుల మీదనే కూటమి పాలన సాగుతోందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ వాలంటీర్లు లేరుగా అంటూంటే సచివాలయం ఉద్యోగులు ఎవరు బాబూ అని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఏ వ్యవస్థ ఏర్పాటు చేసినా అంతిమంగా ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని అంటున్నారు. క్రెడిట్ ఎవరు తీసుకున్నా తీసుకోవచ్చు. కానీ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పార్టీలు పనిచేయాలని అంతా కోరుతున్నారు.