తెలంగాణా ఎన్నికల్లో పవన్ ఇరుక్కున్నారా ?
తెలంగాణా ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ ముహూర్తంలో అనుకున్నారో కాని అప్పటినుండి అన్నీ సమస్యలే చుట్టుముడుతున్నాయి.
By: Tupaki Desk | 8 Nov 2023 5:34 AM GMTతెలంగాణా ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ ముహూర్తంలో అనుకున్నారో కాని అప్పటినుండి అన్నీ సమస్యలే చుట్టుముడుతున్నాయి. చివరి నిముషంలో కుదిరిన పొత్తులో బీజేపీ ఎనిమిది సీట్లను జనసేనకు కేటాయించింది. ఇపుడీ 8 సీట్లలో గెలుపు సంకటంగా మారిపోయింది పవన్ కు. ప్రచారం చేయటం ఒకఎత్తయితే, గెలుపు మరో సమస్యగా మారింది. ఖమ్మం జిల్లాల్లోని ఖమ్మం, మధిర, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, కోదాడ, కూకట్ పల్లి, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది.
గ్రౌండ్ రియాలిటి ప్రకారమైతే జనసేన ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన తెలంగాణాలో కనీసం ఉనికిలో కూడా లేదు. వైఎస్సార్టీపిని పెట్టి రెండేళ్ళు జనాల్లోనే తిరిగిన షర్మిలనే జనాలు పట్టించుకోలేదు. అలాంటిది అప్పుడప్పుడు జనాల్లో కనబడే పవన్ను మాత్రం జనాలు పట్టించుకుంటారా ? పైగా గ్రాఫ్ పడిపోయిన బీజేపీతో పొత్తు మరో మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బీజేపీకే దిక్కులేకపోతే ఇక పొత్తు పెట్టుకున్న జనసేనను ఎవరు పట్టించుకుంటారు ?
ఇపుడిదే పవన్ కు పెద్ద సమస్యగా మారింది. గెలవటం సంగతి పక్కనపెట్టేస్తే అసలు డిపాజిట్లయినా దక్కుతాయా అన్నది మరో సమస్య. ఓటమిలో కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోతే దాని ప్రభావం ఏపీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వంలో ఉన్న అధికారపార్టీని టార్గెట్ చేయకపోతే జనాలు ప్రతిపక్షాల మాటలను పట్టించుకోరు. ఇపుడు పవన్ ప్రచారమంటు మొదలుపెడితే కచ్చితంగా బీఆర్ఎస్+కేసీయార్ ను టార్గెట్ చేయాల్సిందే. లేకపోతే జనాలెవరూ పట్టించుకోరు.
కేసీయార్ ను టార్గెట్ చేయటానికి పవన్ కు ధైర్యంలేదు. ఆ విషయం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభ ప్రసంగంలోనే బయటపడింది. బీఆర్ఎస్ ను, కేసీయార్ వైఫల్యాలను ప్రస్తావించకుండా, టార్గెట్ చేయకుండా ప్రతిపక్షం కాంగ్రెస్ ను లేదా ఇతర పార్టీలను టార్గెట్ చేస్తే జనాలు ఎందుకు పట్టించుకుంటారు ? కేసీయార్ ను టార్గెట్ చేసే ధైర్యంలేకే కదా ఇంతకాలం తెలంగాణాను గాలికొదిలేసింది. ఇదంతా చూస్తుంటే పవన్ అనవసరంగా తెలంగాణా ఎన్నికల్లో అడుగుపెట్టారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి పవన్ ఏమిచేస్తారో చూడాలి.