పంచాయతీ మంత్రిగా పవన్ కొత్త రికార్డు !
ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో ఎంతో మంది పంచాయతీ రాజ్ శాఖకు మంత్రులుగా పనిచేశారు.
By: Tupaki Desk | 20 Aug 2024 3:34 AM GMTఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో ఎంతో మంది పంచాయతీ రాజ్ శాఖకు మంత్రులుగా పనిచేశారు. ఈ శాఖకు తలపండిన వారు అనుభవం నిండిన వారు ఎందరో వచ్చారు. ఎవరి శైలి వారిది. ఎవరి ఆలోచనలు వారివి. అందరూ తమ వంతుగా ఈ శాఖ కోసం పనిచేశారు.
పంచాయతీ రాజ్ శాఖ నిజానికి ఎంతో కీలకమైనది. గ్రామీణ ప్రాంతం దేశంలోనూ రాష్ట్రాలలోనూ ఎక్కువ. నూటికి డెబ్బై శాతం మందికి పని చేసే శాఖ ఇది. అందువల్లనే ఏరి కోరి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నారు. గత రెండు నెలలుగా ఆయన కేవలం తన శాఖ మీదనే పూర్తి దృష్టి పెట్టారు.
శాఖాపరంగా ఆయన పూర్తి అధ్యయనం చేస్తున్నారు. ఈ శాఖలో తన ముద్ర వేయాలని తపన పడుతున్నారు. ఆయన అందుకే మిగిలిన ఏ విషయాలు పట్టించుకోవడంలేదు. కేవలం శాఖాపరమైన రివ్యూస్ నే నిర్వహిస్తున్నారు. ఇపుడు పంచాయతీ రాజ్ శాఖలో పవన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఎవరూ చేయని నిర్ణయం ఇది. ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామ సభలు వేలాదిగా నిర్వహించడం. ఇది నిజంగా ఒక సంచలనంగానే అంతా చూస్తున్నారు. దేశంలో కూడా ఎక్కడా ఇలా జరగలేదు.
ఏపీలో ఈ నెల 23న ఏకంగా 13 వేల 326 గ్రమాలలో గ్రామ సభలు నిర్వహించడం అన్నది ఒక గ్రేట్ అచీవ్మెంట్ గానే చూడాలని అంటున్నారు. ఈ గ్రామ సభలు ఎందుకు అంటే ఆ ఉద్దేశ్యం కూడా గొప్పదే. గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పధకం కింద ఇచ్చే పనులకు ఆమోదముద్ర వేయడం అన్న మాట.
గ్రామాలలో ఉపాధి అవకాశాలు అందించే విధంగా ఈ గ్రామ సభలు ఉండబోతున్నాయి. ఒక ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి పనుల కల్పన మీద అవగాహన పెంచడమే కాదు ఉపాధి హామీ పనులకు గ్రామ సభలలో ఆమోదముద్ర వేయడం.
అలా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులకు అమోదం తెలపడం అంటే పెద్ద ఎత్తున గ్రామాలలో ఉపాధిని అందించడమే కాదు, అదే విధంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అన్నమాట.
నిజంగా ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీనిని ప్రతిష్టగానే తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలపై ఆయన స్పందిస్తూ ఇవేలాది గ్రామ సభలు నిర్వహణ అన్నది విజయవంతం చేయాలని కోరారు.
ప్రతీ గ్రామంలో గ్రామసభ గురించి ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలపాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఉపాధి పనుల కల్పనపై అవగాహన పెంచాలని సూచించారు. గ్రామసభల్లో ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భాగస్వాములు కావాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పంచాయతీ రాజ్ శాఖలో ఈ నెల 23న అతి పెద్ద గ్రామోదయానికి నాంది ప్రస్తావన చేయనున్నారు అని అంటున్నారు.