బిగ్ బ్రేకింగ్... పవన్ కల్యాణ్ ఆదాయం, అప్పులు, విరాళాల వివరాలివే!
చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు భారీ ఎత్తున ర్యాలీ కొనసాగింది.
By: Tupaki Desk | 23 April 2024 11:03 AM GMTఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకుని, పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు నామినేషన్ వేశారు. అంతకముందు... కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు భారీ ఎత్తున ర్యాలీ కొనసాగింది.
అవును... పవన్ కల్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చెబ్రోలు లోని ఆయన ఇంటి వద్ద పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం... రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సబ్ మిట్ చేసిన అఫిడవిట్ లో కీలక విషయాలు వెల్లడించారు.
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలతో పాటు విరాళాల వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300 (నూట పద్నాలుగు కోట్ల, డెభై ఆరు లక్షల, డెభై ఎనిమిది వేల, మూడు వందల రూపాయలు)గా వెల్లడించారు.
ఇక ఈ ఆదాయానికి సంబంధించిన ఆదాయపు పన్నుగా రూ.47,07,32,875, (సుమారు నలభై ఏడు కోట్ల 7 లక్షల పైమాటే), జీఎస్టీ కింద రూ.26,84,70,000 (ఇరవై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెభై వేల రూపాయలు) చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో... రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించిన పవన్... అందులో రూ.17.56 కోట్లు బ్యాంకుల నుంచి, రూ.46.70 కోట్లు వ్యక్తుల నుంచి తీసుకున్నట్లు తెలిపారు!
ఇదే సమయంలో... వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ ఇతర కార్యక్రమాల కోసం రూ.17.15 కోట్లు విరాళం అందించినట్టు తెలిపిన పవన్... కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు రూ.రూ.30.11 లక్షలు, పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ కు రూ.2 లక్షలు విరాళం ఇచ్చినట్టు పేర్కొన్నారు.