Begin typing your search above and press return to search.

టీడీపీని ఇన్సల్ట్ చేసిన పవన్ కల్యాణ్!

అయితే... తాజాగా తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 6:18 AM GMT
టీడీపీని ఇన్సల్ట్  చేసిన పవన్  కల్యాణ్!
X

రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరికైనా పవన్ కల్యాణ్ చేసే రాజకీయ స్టేట్ మెంట్లు ఓ పట్టాన్న అర్ధం కావని అంటుంటారు పరిశీలకులు. తమకు ఒంటరిగా చాలా బలం ఉందంటూనే... రాష్ట్ర ప్రయోజనలాకోసం పొత్తులతో కలిసి వెళ్తున్నామని చెప్పడం పవన్ కే చెల్లింది అని చెబుతుంటారు. ఇంతకు మించిన అవగాహనా రాహిత్యపు స్టేట్ మెంట్ మరొకటి ఉంటుందా అనేది చాలా మంది లేవనెత్తే ప్రశ్న! ఈ క్రమంలోనే అలాంటి స్టేట్ మెంట్ పెద్దదే ఇచ్చారు పవన్.

అవును... ఏ రాజకీయ పార్టీ అయినా కష్టమో, సుఖమో.. ఒంటరిగానే ఎదగాలని భావిస్తుంటుంది తప్ప మరో పార్టీకి బీటీం గా ఉంటూ కాలం గడిపేద్దామని భావించదు! అయితే... తాజాగా తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... "మనం ఒంటరిగా పోటీచేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం. కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కృషి చేయాలి" అని అన్నారు!

దీంతో ఈ స్టేట్ మెంట్ టీడీపీని అవమానపరిచేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు అనుభవం చాలా అవసరం అంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా సహకరించారు పవన్ కల్యాణ్! ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే... అది పవన్ గొప్పతనమే అని జనసైనికులు చెప్పుకోవడం.. దానికీ టీడీపీ నేతలు కాస్త గట్టిగానే కౌంటర్స్ ఇవ్వడం తెలిసిందే.

ఈ క్రమంలో వైసీపీ నేతలు చెబుతున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే పనిలో భాగంగానో ఏమో కానీ... 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో జనసేన ఒక చోట గెలవగా.. పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. ఇది వాస్తవం! ఆ ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఆ ఫలితాల ప్రకారం ఇది జనసేనకు ఉన్న బలం!

కట్ చేస్తే... 2024 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే 40 సీట్లు కచ్చితంగా గెలుస్తామని అంటున్నారు పవన్ కల్యాణ్. “మరి ఇంకెందుకు ఆలస్యం”? అనే ప్రశ్నకు సమాధానం కూడా ముందే వదులుతున్నారు! ఇందులో భాగంగా... రాష్ట్ర ప్రయోజనలా కోసమే టీడీపీతో పొత్తు అని చెబుతున్నారు. పోనీ అప్పుడైనా 60 సీట్లవరకూ పోటీచేస్తారా అంటే..? గౌరవం తగ్గకుండానే పొత్తులో సీట్ల సర్దుబాటు ఉంటుందని అంటున్నారు.

అయితే... ఆ గౌరవానికి సంబంధించిన పరామీటర్స్ హరిరామజోగయ్య లాంటి వారు చెబుతున్నా... పవన్ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కు తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఈ క్రమంలో తాజా స్టేట్ మెంట్ విషయానికొస్తే... పవన్ కు అసలు ఏపీలో ఉన్న బలమెంత అనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో... రాయలసీమలో జనసేన జెండాలు కనిపించడమే చాలా అరుదు కాగా... ఉత్తరాంధ్రలో నాలుగైదు స్థానాల్లో ఎంతో కొంత ప్రభావం చూపగలగడంతో పాటు గోదావరి జిల్లాలో ఓ 10 స్థానాల్లో ప్రభావం చూపగలరని చెబుతున్నారు పరిశీలకులు.

అది కూడా ఆయా స్థానాల్లో జనసేనకు కొన్ని ఓట్లు వస్తాయి కానీ.. సీట్లు రావనేది నొక్కి చెబుతున్న మాట. ఈ సమయంలో జనసేనకు ఉన్న బలానికి టీడీపీ ఓట్లు కూడా తోడయితే... ఎన్నొ కొన్ని స్థానాలు గెలిచినట్లు ఉండటం, అదే క్రమంలో పవన్ కు కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం దక్కడం, ఫలితంగా జనసేనకు శాసనసభలో ప్రాతినిథ్యం లభించడం జరుగుతుంది తప్ప... ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి పరాభవమే అనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.

వాస్తవానికి పవన్ కు ఈ విషయాలు తెలియనివి కావు! 40 స్థానాల్లో గెలిచే అంత సీన్ జనసేనకు ఉంటే... 2019 లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం 4 స్థానాల్లో అయినా గెలిచి ఉండేది కదా? ఆ సృహ ఉండబట్టే పవన్ కల్యాణ్... 2019లో ఒంటరిగా పోటీ చేసి వాపుకీ, బలుపుకీ ఉన్న తేడా గ్రహించడం వల్లే టీడీపీతో పొత్తుకోసం అంతలా ఆరాటపడ్డారని అంటున్నారు. వాస్తవానికి పవన్ ఒంటరిగానో, బీజేపీతోనో కలిసి 40 సీట్లు గెలుచుకుంటే... రేపు ఏపీలో హంగ్ వస్తే ఆయనే చక్రం తిప్పొచ్చు కదా!

ఉదాహరణకు ఏపీలో నిజంగా జనసేనకు సొంతంగా 40 సీట్లు గెలుచుకుంటే... హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే... కర్ణాటకలో కుమార స్వామి తరహాలో పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే అవకాశాలున్నాయి. పైగా మోరల్ సపోర్ట్ గా బీజేపీ ఉండనే ఉంటుంది! ఇలాంటి గోల్డెన్ అవకాశాలు ఉన్నప్పటికీ పవన్... రాష్ట్ర ప్రయోజనల కోసం అనే మాటున ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తూ టీడీపీని అవమాన పరుస్తున్నారని అంటున్నారు.

కారణం... అన్ని అవకాశాలున్నప్పటికీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని.. ఫలితంగా టీడీపీ మనుగడ కోసం తాను త్యాగాలు చేస్తున్నట్లు పవన్ చెబుతున్నట్లు ఉందని అంటున్నారు పరిశీలకులు. అంటే... తాను రాజకీయంగా ఎలాగైనా చక్రం తిప్పేయగలను, ఇంకెలాగైనా గెలవగలను కానీ... తాను లేకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ లేదనే పరోక్ష స్టేట్ మెంట్స్ పవన్ ఇప్పటినుంచే మొదలుపెట్టారని భావించొచ్చు అని అంటున్నారు.