పవన్.. ఇక పిఠాపురం వంతు!
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి రోజే ఏకంగా పది గంటల పాటు సమీక్ష నిర్వహించారు.
By: Tupaki Desk | 29 Jun 2024 11:18 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు, పర్యావరణం, అడవులు, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి కీలక శాఖలకు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం తన శాఖలపై పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి రోజే ఏకంగా పది గంటల పాటు సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ పై జరిగిన ఈ సమీక్ష సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల మళ్లింపుపై అధికారులను ప్రశ్నించారు.
నిత్యం తన శాఖలపై విజయవాడ క్యాంపు ఆఫీసులో, మంగళగిరిలోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన 11 రోజులపాటు వారాహి దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తాజాగా కరీంనగర్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కాగా ఎన్నికల్లో గెలుపొందాక ముఖ్యమంత్రి చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజులపాటు పర్యటించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కూడా తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల్లో గెలుపొందాక ఇప్పటివరకు పిఠాపురంలో పర్యటించలేదు.
ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి 3 వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారని తెలుస్తోంది. రోడ్ షో కూడా ఉంటుందని సమాచారం.
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ తొలి రోజు జూలై 1న గొల్లప్రోలు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జూలై 1 నుంచి పింఛన్లను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రూ.3000 ఇస్తుండగా ఈ మొత్తాన్ని ఏకంగా రూ.4 వేలు చేశారు. దివ్యాంగులకు ఇప్పటివరకు రూ.3 వేలు ఉండగా దీన్ని రూ.6 వేలు చేశారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీ అనంతరం జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
ఇక రెండో రోజు జులై 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో పవన్ సమావేశమవుతారని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం ఆయన తన పార్టీ ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరిలతో సమావేశం కానున్నారు.
మూడు రోజుల పర్యటనలో చివరి రోజు అయిన జులై 3న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ, కొత్తపల్లి తీర ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ సముద్రపు కెరటాలు, అలలు ముందుకురావడంతో పాడైపోయిన రోడ్లను పరిశీలిస్తారు. అలాగే మత్స్యకారుల సమస్యలను కూడా తెలుసుకుంటారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పిఠాపురం పర్యటనకు వస్తున్న పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలకడానికి జనసేన నేతలు, అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.