నేను వింటాను...పరిష్కరిస్తాను...పవన్ అభయం
గత ప్రభుత్వం ఉద్యోగులను భయపెట్టిందని తాను మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటానని పవన్ అన్నారు.
By: Tupaki Desk | 26 Jun 2024 3:38 AM GMTతాను ప్రతీ ఒక్క సమస్యను పూర్తిగా వింటానని వీలైనన్ని వెంటనే పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభయం ఇచ్చారు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందచేసిన నేపధ్యంలో పవన్ వారితో మాట్లాడుతూ అందరం కలసి పని చేద్దామని చెప్పారు.
భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దామని పిలుపు ఇచ్చారు.ఇదంతా నా ఒక్కడి వల్లనే పూర్తి కాదు. ఉద్యోగుల సహకారం, సూచనలు నాకు చాలా అవసరం. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నానని పవన్ వారితో అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు పతనం అయ్యాయని ఆయన అన్నారు. వాటిని తిరిగి గాడిలో పెట్టడం సాధారణ విషయం కాదని అయినా ప్రజలకు ఉపయోగపడేలా వ్యవస్థలకు మళ్లీ జీవం పోసేలా బలమైన సంకల్పంతో పని చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
గత పాలకులు వ్యవస్థలను ఎంత తీవ్రంగా దెబ్బ తీశారో శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తామమని ఆయన అన్నారు. ప్రతీ కీలక శాఖల్లోని వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు
తనకు ఎంతో ఇష్టం తోనే పంచాయతీ రాజ్ వంటి కీలకమైన శాఖలను తీసుకున్నానని, వ్యవస్థ మొత్తం అద్భుతంగా పని చేసేలా ముందుకు తీసుకెళ్తానని పవన్ అన్నారు. ఇక ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి తాను ప్రత్యేకంగా గౌరవం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తాను కూడా ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునేనని తనకు అన్ని సమస్యలూ తెలుసు అని పవన్ అన్నారు. ఉద్యోగుల వేదన వింటాను, వారి సూచనలను స్వీకరిస్తాను అని భరోసా ఇచ్చారు. తాను మొదట బాధలు ఆసాంతం వినేందుకు ప్రయత్నిస్తానని అప్పటికప్పుడు పూర్తి చేసే సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తానని కూడా స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ఉద్యోగులను భయపెట్టిందని తాను మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటానని పవన్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు బలమైన అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం మళ్లీ గాడిన పడుతుందని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి అందే పథకాలకు కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వకుండా వాటి ప్రతిఫలాలు ప్రజలకు దక్కకుండా చేశారని విమర్శించారు.