Begin typing your search above and press return to search.

వాలంటీర్లను దండుపాళ్యంతో పోల్చిన పవన్... రివర్స్ అవుతున్నాయా?

By:  Tupaki Desk   |   13 Aug 2023 5:18 AM GMT
వాలంటీర్లను దండుపాళ్యంతో పోల్చిన పవన్... రివర్స్ అవుతున్నాయా?
X

ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కొనసాగింపు ప్రక్రియ వారాహి మూడో విడతలో కూదా కొనసాగిస్తున్నట్లున్నారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా తాజాగా పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా దండుపాళ్యం బ్యాచ్ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అవును... పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కుటుంబ సభ్యులను పరామర్శించారు పవన్ కల్యాణ్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వాలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు. కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు.

ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. ఈ కేసులో వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌ పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు.

ఇదే క్రమంలో... ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మిస్సింగ్ గురించి చెబితే.. తనపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలకు దిగారని చెప్పిన పవన్... దండుపాళ్యం బ్యాచ్ కు, వాలంటీర్లకు తేడా లేకుండా పోతుందని విమర్శించారు.

కాగా.. పెందుర్తిలో మహిళను హత్యచేసిన యువకుడిని విధులకు సరిగా రావటంలేదన్న కారణంతో వాలంటీర్‌ గా అధికారులు వారం రోజుల క్రితమే తప్పించేశారు. ఆ తర్వాత వారం రోజులకు అతను దారుణానికి పాల్పడ్డాడు!

మరోవైపు... విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఒక మహిళకు డబ్బు ఎరచూసి జనసేన నేత లాడ్జికి తీసుకెళ్ళి హత్య చేశాడు. అలాగే హిందుపురంలో జనసేన నేత ఒక వ్యక్తిపై దాడి చేసి 16 తులాల బంగారాన్ని కాజేశాడు. జనసేనలో యాక్టివ్‌ గా తిరిగేవాళ్ళు కొందరు కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు.

మరి వాలంటీర్లలో ఒకరో ఇద్దరో తప్పుచేస్తే ఏకంగా ఆ వ్యవస్థనే తప్పు బడుతూ, ఆ వ్యవస్తనే రద్దు చేయమని కోరుతూ, తాజాగా వాళ్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చిన పవన్... తన పార్టీలో ఇంతమంది కార్యకర్తలు, నేతలు.. హత్యలు, దోపిడీలు వంటి కేసుల్లో నిందితులుగా ఉంటే... జనసైనికులను కూడా దండుపాళ్యం గ్యాంగ్ అనొచ్చని హింట్ ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.