పవన్ కి ఉన్నది ఆ భయమేనా.. సవాళ్ళు చేస్తున్నా సైలెంట్ గా...?
ఇదిలా ఉంటే పవన్ తో సవాల్ చేసేవారు ఏపీలో పెరిగిపోతున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే పవన్ని తన మీద పోటీ చేయమని చాలెంజ్ చేశారు.
By: Tupaki Desk | 14 Aug 2023 3:36 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధమెక్కి ఆవేశంతో ప్రసంగాలు చేస్తారు. వైసీపీ రహిత ఏపీ అంటారు. జగన్ని అధికారం లో నుంచి దించేస్తాను అంటారు. జస్ట్ ఆరు నెలలు మాత్రమే జగన్ ముఖ్యమంత్రి అంతవరకూ భరించండి ఆ మీదట మన ప్రభుత్వం అంటారు. ఇలా ఇన్ని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇంతకీ తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో చెప్పడంలేదు.
అసలు ఆ విషయంలో కనీసం హింట్ కూడా ఇవ్వడంలేదు. ఇంతకీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే బహుశా ఆయన పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ కి కూడా తెలియదేమో. ఇక పవన్ తాను పోటీ చేసే సీటు ఇప్పట్లో రివీల్ చేయనన్ని ఆ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ అన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఎందుకు అంటే జగన్ ఆయన్ని 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అయినా ఓడించేస్తారుట. అందుకే పవన్ ఆ విషయం అయితే అసలు చెప్పరట.
ఇదిలా ఉంటే పవన్ తో సవాల్ చేసేవారు ఏపీలో పెరిగిపోతున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే పవన్ని తన మీద పోటీ చేయమని చాలెంజ్ చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో చూసుకుందామని ఒక లెవెల్ లో సవాల్ చేశారు. భీమవరంలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా తన మీద పవన్ పోటీ చేయాలని గట్టిగా గర్జించారు.
వీరి సంగతి ఇలా ఉంటే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా పవన్ విషయంలో సవాల్ చేశారు. తన మీద పవన్ దమ్ముంటే పోటీ చేయాలని కోరారు. తన గురించి అవినీతి ఆరోపణలు పవన్ చేశారు అన్న ఆవేశంతో ఆయన ఈ సవాల్ చేశారు ఇక పవన్ని తన నియోజకవర్గంలో పోటీ చేయమని జనసేనలోనే చాలా మంది నేతలు కోరుతున్నారు.
ఈ మేరకు వారు పార్టీ తరఫున తీర్మానాలు చేసి కూడా పవన్ కి పంపిస్తున్నారు. అందులో గాజువాక, తిరుపతి, విశాఖ ఉత్తరం, భీమవరం, నర్సాపురం, పిఠాపురం వంటివి ఉన్నాయి. అయినా పవన్ ఆ వైపునకు తొంగి చూడడం లేదు. ఎందుకు అంటే ఆయనకు భయాలు ఉన్నాయని అంటున్నారు. ముందే సీటు ఇదని చెబితే జగన్ ఓడిస్తారు అని అంటున్నారు.
అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే 2019లో కూడా పవన్ తాను పోటీ చేసే రెండు సీట్ల విషయమూ ఎన్నికల నోటిఫికేషన్ దాకా ఎక్కడా బయటపెట్టలేదు. అవే గాజువాక, భీమవరం. అయినా సరే ఆ రెండు సీట్లలో పవన్ ఓడిపోలేదా అని గుర్తు చేస్తున్నారు. మరో విషయం ఏంటి అంటే ఓడించాలనుకుంటే నోటిఫికేషన్ కి ఎన్నికలకు మధ్య ఉన్న ఆ గ్యాప్ చాలు అని అంటున్నారు.
ఆయినా ఓడించేది ఎవరు గెలిపించేది ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ని జగన్ ఓడించాలని చూసినా జగన్ని సీఎం కానీయను అని పవన్ సవాల్ చేసినా ఈ రెండూ కూడా తప్పున్నర వాదనలే అంటున్నారు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో జనాలకు తెలుసు. వారిదే అసలైన తీర్పు. అందువల్ల పవన్ జనాలను నమ్ముకుంటే ఇప్పటి నుంచే తన సీటు ఏదో ప్రకటిస్తే ఆయనకూ పార్టీకి కూడా మేలు జరుగుతుంది అని అంటున్నారు. మరి పవన్ పోటీ చేసే సీటు ఎఒదో చెబుతారా. ఏమో. డౌటే మరి.