Begin typing your search above and press return to search.

టీడీపీ పైన వత్తిడి పెడుతున్న పవన్...?

అదే టైం లో ఆయన వైసీపీ మీద చేస్తున్న విమర్శలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి

By:  Tupaki Desk   |   15 Aug 2023 3:41 AM GMT
టీడీపీ పైన వత్తిడి పెడుతున్న పవన్...?
X

పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా 2019 కంటే ఇపుడు జనాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. దానికి రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఒకటి జగన్ని సీఎం గా ఉండరాదని పవన్ కి ఉన్న పట్టుదల అయితే రెండవది తెలుగుదేశం తో దోస్తీ కట్టి ఎలాగైనా ఏపీలో మూడవ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయం.

ఈ నేపధ్యంలో కొన్నిసార్లు అగ్రెసివ్ మోడ్ లో పవన్ వెళ్తున్నారు. అదే టైం లో ఆయన వైసీపీ మీద చేస్తున్న విమర్శలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రిని పట్టుకుని ఏకవచన ప్రయోగం చేయడం అవినీతి ఆరోపణలు చేయడం, ప్రభుత్వం మారడం ఖాయమని ప్రకటనలు చేయడం వంటివి చూస్తే కనుక పవన్ స్పీడ్ ఏంటో అర్ధం అవుతుంది.

ఇదిలా ఉంటే పవన్ వారాహి యాత్రకు ముందు తరువాత అన్నట్లుగా జనసేన రాజకీయం మారింది అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తులు పెట్టుకోవాలన్నది ఒక నిర్ణయం అయితే ఈ పొత్తులలో కూడా ఎత్తులతో టీడీపీ నుంచి గణనీయమైన నంబర్ లో సీట్లను సాధించాలన్నది మరొక ఆలోచనగా చెబుతున్నారు.

ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే యాభై సీట్లకు తగ్గకుండా టీడీపీ నుంచి తీసుకోవాలన్నది జనసేన టార్గెట్ అని అంటున్నారు. ఆ సీట్లు అన్నీ కూడా టీడీపీకి కంచుకోటలే కావడం విశేషం. ఒక వైపు వైసీపీ మీద బాహాటంగా దూకుడు చేస్తూ వస్తున్న జనసేనాని అదే సమయంలో టీడీపీ మీద వత్తిడి పెంచుతున్నారని అంటున్నారు. ఈ వత్తిడి మూలంగా తెలుగుదేశం ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడుతోంది అని అంటున్నారు.

ఇక ఏపీలో 175 సీట్లు ఉంటే అందులో జనసేనకు యాభై సీట్లు ఇచ్చేసి బీజేపీ కూడా చివరి నిముషంలో పొత్తులకు వస్తే ఆ పార్టీకి మరో పదో పదిహేనో సీట్లు ఇస్తే అచ్చంగా 110 సీట్లలోనే టీడీపీ పోటీ చేయాల్సి వస్తుంది. ఏపీలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లుగా ఉంటుంది. 110 సీట్లకు పోటీ చేస్తే టీడీపీ మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు రావు అన్నది ఒక నిఖార్సు అయిన విశ్లేషణ.

అపుడు మిత్రులతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలా అయిదేళ్ల పాటు అధికారం కూడా షేర్ చేసుకుంటూ నడపడం చాలా కష్టం అవుతుంది. అది సంకీర్ణ ప్రభుత్వం అవుతుంది. టీడీపీ హిస్టరీలో సంకీర్ణ ప్రభుత్వం నడిపిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబు గెలవడానికి మిత్రుల సాయం తీసుకున్నా ప్రభుత్వం ఏర్పాటుకు కూడా తీసుకోవాలని అనుకోవడం లేదు అంటున్నారు.

రేపటి రోజున పరిస్థితులు ఎటు నుంచి ఎటు తిరిగినా కూడా తమంతట తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ నిబ్బరం ఆ భరోసా వేరేగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే జనసేన బిగ్ నంబర్ తో వస్తే ఎలా అన్నదే ఇపుడు ఆలోచనలో ఉన్న విషయం అంటున్నారు. వారాహి యాత్రకు జనాలు వస్తున్నారు. గ్రాఫ్ పెరిగింది అని జనసేన భావిస్తున్న వేళ టీడీపీ మీద గట్టిగానే వత్తిడి పడుతోంది అంటున్నారు. వైసీపీని పవన్ టార్గెట్ చేయడం హ్యాపీగా ఉన్నా కూడా జనసేన రేపటి ఎన్నికల్లో పొత్తుల విషయంలో సర్దుబాటు వైఖరితో వ్యహరించకపోతే ఇబ్బందే అన్నది టీడీపీ ఆలోచన అంటున్నారు.