ఇందుకు కదా ప్యాకేజీ స్టార్ అనేది పవనా?
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. వారు ఎదుర్కొనే సమస్యలు మాత్రమే తన రాజకీయ ఎజెండా అనుకుంటే ఎవరూ ఏమీ అనుకోరు
By: Tupaki Desk | 7 Oct 2023 5:32 AM GMTచేసేదంతా చేసి.. తీరా ఎవరైనా ఒక మాట అంటే గింజుకోవటం కొందరిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో చూస్తే.. ఇలాంటి తీరును ప్రదర్శించే పార్టీ అధినేత ఒకరు కనిపిస్తారు. ఆయనే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. పవన్ ను వ్యక్తిగతంగా కానీ.. ఆయన శీలాన్ని శంకించటం మా ఉద్దేశం కానే కాదు. కానీ.. ఆయన తీసుకునే నిర్ణయాలు.. అపరిప్వకతతో.. రాజకీయ అవగాహన లేమితో పాటు.. ఎవరికో లాభం చేయటం కోసం తనను తాను సమిధ మాదిరి మార్చుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. వారు ఎదుర్కొనే సమస్యలు మాత్రమే తన రాజకీయ ఎజెండా అనుకుంటే ఎవరూ ఏమీ అనుకోరు. ఎందుకంటే.. దానికి తగ్గట్లు ఆయన అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ.. అదేమీ లేకుండా ప్రశ్నలు తలెత్తేలా.. వేలెల్తి చూపేలా ఆయన తీరు ఉండటాన్నిఎవరైనా ప్రశ్నిస్తారు. ఏపీలో ఆయన చేస్తున్న రాజకీయాల్ని కొంతమేర అర్థం చేసుుకోవచ్చు. సొంతంగా బలం లేని వేళ.. తనకు అనువుగా ఉండే పార్టీతో చేతులు కలపటం కొంతలో కొంత అర్థం చేసుకోతగినదే.
అలా కాకుండా తాను ఒంటరిగా మాత్రమే పోటీ చేస్తానంటే మాత్రం 2019లో ఏం జరిగిందో.. 2024లో కూడా అదే జరుగుతుంది. అందుకే.. తన క్యాడర్ కు పెద్దగా ఆసక్తి లేకున్నా తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఏపీ రాజకీయం ఇట్లా ఉంటే.. మరో వారం వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. తాము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించటంతో పాటు.. తాము పోటీకి దిగే నియోజకవర్గాల్ని ప్రకటించేశారు పవన్ కల్యాణ్.
మొత్తం 119 నియోజకవర్గాల్లో నాలుగో వంతుస్థానాలకు మించి రెండు మూడు అదనంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విషయాన్ని ప్రకటన రూపంలో తెలియజేశారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఏం జరుగుతుంది. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ టీడీపీతో కలిసి పోటీ చేస్తారా? ఒంటరిగా పోటీచేస్తారా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ.. కలిసి కాదు ఒంటరిగా పోటీ చేస్తారన్నదే నిజమైతే.. అసలుక్యాడరే లేని చోట పోటీ చేయటం వల్ల ప్రయోజం ఏమిటి? అన్నది ప్రశ్న.
తెలంగాణలో జనసేన పోటీ చేయటం ద్వారా ఓట్ల చీలికకు తప్పించి మరి దేనికైనా ఉపయోగపడతారా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తెలంగాణలో తన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తాయా? అన్న దాని మీద కూడా క్లారిటీ లేనప్పుడు పోటీకి దింపటం ద్వారా బలం కంటే బలహీనతను ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
మొత్తంగా చూస్తే.. తెలంగాణలో జనసేన పోటీ.. అధికార బీఆర్ఎస్ కు ప్రయోజనకరంగా మారేలా చేయటమే పవన్ ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఒకరి ప్రయోజనం కోసం పవన్ పని చేయటం ఏమిటి? ప్రజల కోసం పని చేస్తానని చెప్పే పవన్ మాటలు తప్పు అయినట్లే కదా? అన్నదిప్పుడు మరో సందేహం. ఏతావాతా చూస్తే.. తన మీద ప్రత్యర్థులు తరచూ ఆరోపించే.. ప్యాకేజీ స్టార్ మాటకు తగ్గట్లే పవన్ తీరు ఉంది కదా? అన్న మాట వినిపిస్తోంది. అన్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే బదులు.. అనేందుకు అవకాశాన్ని ఇస్తున్న తన తీరును తాను నిందించుకోవాల్సిన అవసరం పవన్ కు ఉందని చెప్పాలి. తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన టైం వచ్చిందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది.