ఢిల్లీకి పవన్... బీజేపీతో చెప్పడానికా.. తెలుసుకోడానికా?
ఇప్పటికింకా తాను ఎన్డీఏ లోనే ఉన్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు! అంతకముందు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. 32 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీకి నిలబడతారని వెల్లడించారు
By: Tupaki Desk | 25 Oct 2023 10:54 AM GMTఇప్పటికింకా తాను ఎన్డీఏ లోనే ఉన్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు! అంతకముందు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. 32 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీకి నిలబడతారని వెల్లడించారు. ఇంతలోనే ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ - జనసేన కలిసే పోటీచేస్తాయని ప్రకటించారు. ఇక ఆ కూటమిలోకి బీజేపీ రావడం, రాకపోవడంపై విభిన్నమైన కామెంట్లు చేశారు! ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేయబోతోందని అంటున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ హస్తినకు బయలుదేరారు!
అవును... కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఇందులో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు! దీంతో... ఇవాళ రేపట్లో తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు వ్యవహారం, సీట్ల సర్ధుబాటు వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ విషయంంలో జనసేన కనీసం 20 - 30 సీట్లు అడుగుతుండగా... బీజేపీ నేతలు మాత్రం 5 - 10 స్థానాలు మాగ్జిమం అని అంటున్నారని కథనాలొస్తున్నాయి.
అయితే ఈ కీలక సమయంలో అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ కల్యాణ్ భేటీ అంటే తెలంగాణలో సీట్ల పంచాయతీపై క్లారిటీ రావడం సంగతి అటుంచితే... కచ్చితంగా ఏపీ రాజకీయాల ప్రస్థావన కూడా వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అసలు సిసలు కీలక విషయం అనేది వారు చెప్పే మాట. కారణం... ఏపీలో టీడీపీ తరుపున నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోపక్క ఇప్పటికే టీడీపీ - జనసేనలు ఉమ్మడి కార్యచరణ ప్రకటించేశాయి!
ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు పవన్ కు అతి ముఖ్యమైన పాయింట్! ఏపీలో జనసేనకు ఎన్ని సీట్లు అని అడగడం కంటే... ఏపీ విషయంలో బీజేపీ మనసులో మాట వీలైనంత స్పష్టంగా గ్రహించడం ప్రధానం!! మరో ఐదారు రోజుల్లో టీడీపీ - జనసేనల ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల కాబోతున్న సమయంలో... జనసేన పొలిటికల్ సిద్ధాంతంపై కూడా ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటే... ఏపీలో కూడా బీజేపీ ఉంది కాబట్టి అక్కడ కూడా కలిసి పనిచేయాలని బీజేపీ కోరే ఛాన్స్ ఉంది! అది నైతికత కూడా!! అలా కాకుండా... తెలంగాణలో బీజేపీ వీక్ గా ఉంది కాబట్టి అక్కడ వారికి సపోర్ట్ చేస్తాము, ఏపీలో టీడీపీ వీక్ గా ఉంది కాబట్టి ఇక్కడ వీరికి సపోర్ట్ చేస్తాము అని జనసేన చెబితే... అది పార్టీ క్రెడిబిలీటీని మరింత ప్రశ్నార్ధకం చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఇన్ని సంక్షిష్ట పరమపదసోపానం లాంటి ఈ పరిస్థితుల్లో... తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అనే పాయింట్ కంటే... బీజేపీని.. ఏపీ బీజేపీ, తెలంగాణ బీజేపీ అని విభజించి పొత్తులు పెట్టుకునే విషయంపై జనసేన అధినేత ఇచ్చే క్లారిటీ మరింత ముఖ్యమైన పాయింట్ అని అంటున్నారు విశ్లేషకులు. మరి హస్తిన భేటీ ఎలాంటి ఫలితాలు, మరెలాంటి స్పష్టతలు ఇస్తుందనేది వేచి చూద్దాం.
కాగా... ఇటీవల పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్షణ్ లు కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలంగాణలో బీజేపీతో కలిసిపోటీచేయడానికి పవన్ అంగీకరించారని.. కాకపోతే 30 సీట్లు అడుగుతున్నారని.. ఆ విషయంపై పెద్దలతో చర్చించబోతున్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.! ఈ నేపథ్యంలో నాటి ఆ భేటీకి కొనసాగింపుగా ఈరోజు ఢిల్లీలో పవన్ కల్యాణ్.. అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ జరుగుతోంది!