పవన్ ఒకే ఒక్క సభ...అంతేనా...!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికల ప్రచారం ఒకే ఒక్క సభతో సమాప్తం అవుతుందని అంటున్నారు
By: Tupaki Desk | 19 Nov 2023 5:43 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా ఎన్నికల ప్రచారం ఒకే ఒక్క సభతో సమాప్తం అవుతుందని అంటున్నారు. అది కూకట్ పల్లి సభ అని తెలుస్తోంది. ఈ నెల 26న కేంద్ర హోం మంత్రి బీజేపీ జాతీయ నేత అమిత్ షాతో కలసి కూకట్ పల్లిలో జరిగే సభలో పవన్ కళ్యాణ్ పాలు పంచుకో బోతున్నారు.
ఈ సభ తరువాత మరో రెండు రోజులకు అంటే నవంబర్ 28 సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అంటే ఓవరాల్ గా పవన్ పాల్గొనే ఏకైక సభ ఇదే అన్న మాట. పవన్ బీజేపీతో జనసేన పొత్తు కలిపి ఎనిమిది సీట్లను తీసుకున్నారు. ఆ పార్టీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.
పవన్ తన పార్టీ తరఫున ఎనిమిది మంది అభ్యర్ధుల కోసమైనా ప్రచారం చేసి ఉంటే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన పార్టీలకు చెందిన వారు అంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేన అభ్యర్ధులకు ఆ అవకాశం లేకుండా పోయింది. తెలంగాణాలో చూస్తే మొదటిసారి జనసేన పోటీ చేస్తోంది.
అది ఎలా ఉండాలి. చాలా గట్టిగా సౌండ్ చేయాలి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రచారం అయితే హోరెత్తించాలి. కానీ జనసేనలో ఆ హడావుడి అయితే లేదు. అధినేత ప్రచారంలో పాల్గొనకపోవడమే అసలైన వెలితిగా చెప్పుకుంటున్నారు. ఈ మాత్రం దానికి ఏకంగా సొంతంగా 32 సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అని ముందే ప్రకటించారు కూడా.
నిజంగా అదే జరిగితే 32 సీట్లలోనూ పరిస్థితి ఇలాగే ఉండేదా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. ఇంతకీ పవన్ ఎందుకు ప్రచారం చేయడం లేదు అన్న దాని మీద కూడా రకరకాలైన అంశాలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ గ్రాఫ్ తగ్గిపోవడం జనసేనకు కూడా గెలుపు అవకాశాలు లేకపోవడం వల్లనే ఆయన ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.
అయితే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో గెలుపు అన్నది ఇంపార్టెంట్ కాదని, ఓడినా కూడా ఎవరూ గట్టిగా జనంలో నిలిచి ఉన్నారు అనేది ప్రాధాన్యత అని అంటూంటారు. ఆ విధంగా తీసుకుంటే ఎక్కువ శాతం ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఎంతో కొంత ఆయన పార్టీ అభ్యర్ధులకు ఉపయోగపడేది కదా అని కూడా అంటున్నారు.
అయితే జనసేన కోసం ప్రచారం మొదలెడితే కేవలం అది ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితం అయిపోదు బీజేపీకి కూడా ప్రచారం చేయాలి. అదే సమయంలో కాంగ్రెస్ బీయారెస్ ల మీద కూడా గట్టిగా విరుచుకుపడాలి. మరి ఇవన్నీ ఆలోచించి పవన్ ప్రచారానికి దూరంగా ఉన్నారు అని అంటున్నారు.
రేపటి రోజున తెలంగాణాలో బీయారెస్ అయినా కాంగ్రెస్ అయినా వస్తుందని అంచనాలు ఉన్న నేపధ్యంలోనే పవన్ తన ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీతో పొత్తు ఉంది. తెలంగాణాలో టీడీపీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటోంది. పవన్ కనుక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తే ఓట్లు చీలి అది అంతిమంగా కాంగ్రెస్ ని దెబ్బకొడుతుందని, బీయారెస్ కి వరం అవుతుందని లెక్కలు ఉన్నాయి.
మరి ఇవేమైనా ఆలోచించి పవన్ ప్రచారానికి దూరంగా ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా పవన్ని నమ్ముకుని బరిలోకి దిగిన వారిలో ఒక్క కూకట్ పల్లి అభ్యర్ధికి తప్ప మిగిలిన వారికి అయితే ఊరట కలగడంలేదు. ఎన్నికల్లో నిలబడిన వారు అంతా కొత్త వారు. వారు పాట్లు వారు పడుతున్నారు. అధినాయకత్వం అండగా ఉంటే బాగుండేది అన్నదే తెలంగాణా జనసేనలో చర్చగా ఉందిట.