ఆత్మాభిమానమే అసలు చిక్కు... జనసేన తప్పులు దిద్దుకుంటుందా...?
ఏ పార్టీకైనా.. నాయకుడికైనా ఆత్మాభిమానమే ముఖ్యం. ముఖ్యంగా యువ తరం నాయకులకు.. ఆత్మ గౌరవం అత్యంత ప్రధానం
By: Tupaki Desk | 6 Dec 2023 12:30 AM GMTఏ పార్టీకైనా.. నాయకుడికైనా ఆత్మాభిమానమే ముఖ్యం. ముఖ్యంగా యువ తరం నాయకులకు.. ఆత్మ గౌరవం అత్యంత ప్రధానం. ఈ విషయంలోనే అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అయితే.. జనసేన పార్టీ విషయంలో అడుగులు తడబడేలా వ్యవహరించింది. తనకంటూ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా.. పార్టీ పరంగా మొత్తం అధికారాలను బీజేపీ చేతిలో పెట్టేసిందనే భావన తెలంగాణలో వినిపిస్తోంది.
అందుకే.. తెలంగాణలో జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ ఏడు చోట్ల డిపాజిట్లు కూడా దక్కించు కోలేక పోయిందని పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. తమ నాయకుడి ఫొటో చూపించి.. గెలవాలని భావించిన బీజేపీకి.. తమ పార్టీ పూర్తిగా అరెస్టు అయిపోయినట్టు వ్యవహరించిందనేది వారి ఆవేదన. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో 25 సీట్లు కోరాలని.. జనసేన ముందు నిర్ణయించుకుంది. తర్వాత.. 15 చాలని భావించింది.
అయితే.. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితం చేయడం.. పైగా.. జనసేన నేతలు పోటీ చేసిన చోట కూ డా.. బీజేపీ నాయకులు పెద్దగా ప్రచారం చేయకపోవడం.. క్షేత్రస్థాయిలో బీజేపీ ఓటు బ్యాంకును జనసేన కు అనుకూలంగా మార్చకపోవడం వంటివి జనసేన నాయకులను ఇరకాటంలో పడేశాయి. ఫలితంగా ఏడు చోట్ల జనసేన నాయకులు కనీస డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు. దీంతో ఏపీలో విషయానికి వస్తే.. ఇక్కడైనా ఆత్మభిమానంతో వ్యవహరించాలనేది జనసేన నాయకులు చెబుతున్న మాట.
''ఇప్పటికే పదవులు వద్దన్నారు. పీఠాలు అవసరం లేదన్నారు. కనీసం.. సీట్ల విషయంలో అయినా.. ఆత్మాభిమానం నిలబెట్టుకుంటారో లేదో! తెలంగాణలో ముందు నుంచి కనీసం ఒకటిరెండు స్థానాల్లో అయినా గెలుస్తామని అనుకున్నాం. కానీ, బీజేపీ వ్యూహంలో మేం చిక్కుకుపోయాం. ఏపీలో అలా కాకుండా చూడాలని కోరుతున్నాం'' అని జనసేన ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.