Begin typing your search above and press return to search.

సీఎం సీటు.: పవన్ వ్యూహం కరెక్టేనా...!?

రాజకీయాల్లో ఎవరికైనా సీఎం సీటు జీవిత కాలం కోరికగా ఉంటుంది. సీఎం అయితే చాలు రాజకీయాల్లో పరమపధ సోపానం అధిరోహించినట్లుగా భావిస్తారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 9:30 AM GMT
సీఎం సీటు.:  పవన్ వ్యూహం కరెక్టేనా...!?
X

రాజకీయాల్లో ఎవరికైనా సీఎం సీటు జీవిత కాలం కోరికగా ఉంటుంది. సీఎం అయితే చాలు రాజకీయాల్లో పరమపధ సోపానం అధిరోహించినట్లుగా భావిస్తారు. అది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మరిన్ని పై మెట్లు ఎక్కేందుకు ఆస్కారం ఉంటుంది. చంద్రబాబుకు 45 ఏళ్లకే సీఎం పోస్టు దక్కితే జగన్ కి 47 ఏళ్ళకు దక్కింది. ఇటీవల తెలంగాణాకు కొత్త సీఎం అయిన రేవంత్ రెడ్డికి 55 ఏళ్లకు ఆ పదవి దక్కింది.

వీరంతా యంగ్ చీఫ్ మినిస్టర్స్ కిందనే లెక్క. చంద్రబాబు సీఎం యంగ్ ఏజ్ లో కాబట్టి ఇంతటి సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ ని చూస్తున్నారు. జగన్ కి సైతం రాజకీయంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. రేవంత్ కి అదే వర్తిస్తుంది. మరి సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీ పడ్డారు. ముఖ్యంగా సినీ రంగం నుంచి వచ్చిన వారిలో ఒక్క ఎన్టీఆర్ కే ఆ పదవి దక్కింది.

మిగిలిన వారికి మాత్రం అందని పండు అయింది. సూపర్ స్టార్ క్రిష్ణను సీఎం ని చేస్తామని చెప్పి రాజకీయాల్లోకి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానించారని చెబుతారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే క్రిష్ణ ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యేవారు అని అంటారు. ఇక ఆ తరువాత తెలిసిందే.

క్రిష్ణం రాజు కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పడితే మెగాస్టార్ చిరంజీవి సీఎం సీటునే టార్గెట్ చేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అయితే ఆయన టైమూ టైమింగ్ రాంగ్ కావడంతో పీఆర్పీ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలింది. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి కూడా అన్న మెగాస్టార్ కి ఉన్నంత ఆదరణ ఉంది.

ఆయన 2014లో జనసేన పేరుతో పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అది వ్యూహాత్మకమైన తప్పిదంగా అంతా చెబుతారు. ఈ రోజు పొత్తుల కోసం చూసిన పవన్ ఆనాడే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఈపాటికి ఏపీలో జనసేన బలంగా తయారు అయ్యేది అని అంటారు. ఇక 2019లో ఆయన టీడీపీతో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోకుండా విడిగా పోటీ చేశారు. అది కరెక్ట్ అనుకున్నా ఓటమి ఎదురైంది.

దాన్ని అలాగే కంటిన్యూ చేయకుండా ఓడిన మరుక్షణం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీలూ ఏపీలో థర్డ్ ఫోర్స్ గా ఎదుగుతాయి అనుకుంటే పవన్ టీడీపీ వైపు టర్న్ అయ్యాయి. అయితే ఈ పొత్తులు కూడా టీడీపీ అవసరం కోసం అని కాకుండా తన అవసరం కోసం అన్నట్లుగా పవన్ వ్యవహరించిన విధానం వల్ల అనుకునే సీన్ ఏర్పడింది అంటున్నారు.

వారాహి యాత్రకు జనంలో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అలా గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలలో చూసుకుంటే ఒంటరిగా జనసేన పోటీ చేసినా కనీసంగా పాతిక ముప్పయి సీట్లు వచ్చేవని అంటున్నారు. అలా పవన్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఏపీలో హంగ్ అసెంబ్లీకి చాన్స్ ఉండేదని అంటున్నారు.

అలా ఎన్నికల అనంతరం కింగ్ మేకర్ అవతారం ఎత్తి కింగ్ గా మారే చాన్స్ ని పవన్ పోగొట్టుకున్నారా అన్నది ఒక చర్చగా ఉంది. ఇక టీడీపీతో పొత్తు అయినా జైలు వద్ద తొందరపడి ప్రకటించకుండా ఉండి ఉన్నా బాగుండేది అన్న వారూ ఉన్నారు. అయితే పవన్ కోణం లో నుంచి చూస్తే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఈసారి కచ్చితంగా పాతిక నుంచి ముప్పయి మంది దాకా ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే అసెంబ్లీలో బలమైన పక్షంగా ఉంటామన్నది.

ఇక టీడీపీతో కలసి ఉంటూనే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఏపీలో తాను ఆల్టర్నేషన్ కావాలన్నది పవన్ ఆలోచన అని అంటున్నారు. అయితే అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా అంటే లేదు అనే అంటున్న వారు ఉన్నారు. ఒక వేళ టీడీపీ జనసేన కూటమి గెలిచి వైసీపీ ఓడినా బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. 2029 నాటికి మళ్లీ తొడగొట్టి అధికారం అందుకునే దిశగానే జగన్ దూకుడు రాజకీయం ఉంటుంది.

అందువల్ల విపక్షం రోల్ వైసీపీ తీసుకుంటుంది. అధికార పక్షంగా టీడీపీ ఉంటే పవన్ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది అన్న ప్రశ్న కూడా ఉంది. మరి దీర్ఘకాలంలో సీఎం పదవిని లక్ష్యంగా చేసుకుని టీడీపీతో పొత్తుకుని ముందుకు వెళ్తున్న పవన్ తాను అనుకున్న సీట్లు అయినా టీడీపీ నుంచి సాధించకపోయినా ఇచ్చిన సీట్లలో జనసేన కోసం పదేళ్ల పాటు పనిచేసిన సిసలైన సైనికులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోకపోయినా కూడా అది జనసేన భవిష్యత్తుని ఇబ్బందిగా మారుస్తుంది అని అంటున్నారు.

ఏది ఏమైనా సీఎం సీటు 2024లో పవన్ కి దక్కుతుంది ఆయన కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా అవుతారు అని అనుకున్న వారికి ప్రత్యేకించి ఆయన సామాజికవర్గానికి మాత్రం ఆ పార్టీ పోకడ ఒకింత నిరాశగానే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏ అద్భుతం జరుగుతుందో.