చెక్కులు వెనక్కి ఇచ్చేస్తున్న జనసేన.. టికెట్ల కోసమేనా?
ఏపీలో టీడీపీతో చేతులు కలిపి వచ్చే ఎన్నికలకురెడీ అవుతున్న జనసేనలో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది
By: Tupaki Desk | 7 Feb 2024 2:58 AM GMTఏపీలో టీడీపీతో చేతులు కలిపి వచ్చే ఎన్నికలకురెడీ అవుతున్న జనసేనలో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. పార్టీ సమాయత్తం అవుతున్న వేళ పలువురు వచ్చి పార్టీలో చేరుతున్నారు. ఇది మంచి పరిణామమేన ని పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలా పార్టీలో చేరిన ప్రముఖులు .. పార్టీ ఫండ్ కింద.. కొంత మొత్తాలను వారు చెక్కుల రూపంలో పవన్‌కు నేరుగా అందించారు. వాటిని ఆయన పార్టీ కోశాధికారికి ఇచ్చారు. రేపో మాపో వాటిని డబ్బుల రూపంలో మార్చుకోవల్సి ఉంది. దీనిని పార్టీ ఫండ్ కింద.. ప్రచారానికి పంచాలని నిర్నయించారు.
కానీ, ఇంతలోనే పవన్ మనసు మార్చుకున్నారు. సదరు చెక్కులు ఇచ్చినవారికి వెంటనే ఆయా చెక్కులు రిటర్న్ చేయాలని పార్టీ కీలక నేతలకు ఆయన సూచించారు. దీంతో వారు.. చెక్కులు ఇచ్చినవారికి వాటిని పంపేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చెక్కులు ఇచ్చిన వారిలో మాజీ ఐఏఎస్‌లు ఇద్దరు, సినీరంగానికి చెందిన ప్రముఖులు ముగ్గురు ఉన్నారు. వీరికి ఆయా చెక్కులు చేర్చే పనిని నాదెండ్ల మనోహర్ యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ చెక్కుల మొత్తం విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
అయినప్పటికీ.. ఈ చెక్కులు తీసుకోకూడదని నిర్ణయించడం వెనుక.. టికెట్లే కారణమని తెలుస్తోంది. పార్టీలోచేరిన వారికి టికెట్లు ఆశించే లక్షణం సర్వసాధారణం., ఇటు వైసీపీ అయినా.. అటు టీడీపీ అయినా.. అసలు ఏపార్టీ అయినా..ఏదో ఒకటి ఆశించకుండా అయితే.. పనిచేయరు. కానీ, జనసేనలో ఈ సిస్టం లేదు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నమ్మి ప్రజలకు సేవచేసే వారికి మాత్రమే పార్టీ పిలుపునిస్తోంది. కండువా కప్పుతోంది.
దీనికి విరుద్ధంగా చెక్కులు ఇచ్చి.. పార్టీలో చేరిన వారు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో తమకు టికెట్టు కావాలని.. గత రెండు రోజులుగా పోరు పెడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. టికెట్లు ఎక్కువగా లేక పోవడం. ఇప్పటికే పార్టీలో ఉన్నవారికి న్యాయం చేయాల్సి రావడంతో చెక్కులు ఇచ్చిన వారిని పక్కకు పెట్టాలని వారి సొమ్ములు తిరిగి ఇవ్వాలని జనసేన నిర్ణయించడం గమనార్హం. మరి దీనిపై అవతలి పక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.