Begin typing your search above and press return to search.

ఎంపీగా పవన్...ఆపై కేంద్ర మంత్రిగా....!?

జనసేన అధినేత ఎమ్మెల్యేగా కాదా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా. ఏమో ఈ కొత్త వార్త గాసిప్ గా బయటకు వచ్చింది

By:  Tupaki Desk   |   8 Feb 2024 5:30 PM GMT
ఎంపీగా పవన్...ఆపై కేంద్ర మంత్రిగా....!?
X

జనసేన అధినేత ఎమ్మెల్యేగా కాదా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా. ఏమో ఈ కొత్త వార్త గాసిప్ గా బయటకు వచ్చింది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని మిత్ర పార్టీ బీజేపీ పవన్ కి సూచించినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న బీజేపీ పెద్దలు కాకినాడ నుంచి ఎంపీగా పవన్ గెలిస్తే కేంద్రంలో మంత్రిగా చాన్స్ ఇవ్వబోతున్నట్లుగా ఆయనతో చెప్పినట్లుగా వార్త అయితే చక్కర్లు కొడుతోంది.

దీనికి మూలం ఏంటి అంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని లాంచనంగా నిర్ణయించుకున్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. పొత్తుల వెనక అసలు ఎత్తులు కూడా ఏమిటి అనేది తెలియదు. అయితే ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం కూటమికి పడాలి అంటే ఆ సామాజిక వర్గం అధికారంలో వాటా కోరుకుంటోంది.

దాంతో ఆ వర్గాన్ని శాంతింపచేయడానికి అన్నట్లుగా ఈ కొత్త ఫార్ములా ఒకటి బయటకు తెచ్చారని అంటున్నారు. పవన్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే కేంద్రంలో ఆయన మంత్రి అవుతారు. అలాగే ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అలా పవన్ చంద్రబాబు ఇద్దరూ అధికారంలో ఉంటారు, పదవులు పొందుతారు. అలా రెండు బలమైన సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్లు అవుతుంది అని బీజేపీ పెద్దన్నలు కూటమి నేతలను సూచించారు అని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తో కూడా పొత్తు విషయాలను చర్చించడంతో పాటు ఎంపీగా పోటీ చేయమని చెబుతారు అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని కేంద్ర మంత్రిగా కాపులు చూడాలని కోరుకోవడం లేదు. కాపులలో ఎంతో మంది కేంద్రంలో కీలక శాఖలు చేపట్టారు. మంత్రులు గా చక్రం తిప్పారు. అంతవరకూ ఎందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా కేంద్ర మంత్రి అయ్యారు. అయితే దాని వల్ల కాపులు శాంతించలేదు అని అంటున్నారు.

వారికి కావాల్సింది ఏపీలో ముఖ్యమంత్రి పదవి అని అంటున్నారు. ఆ విషయంలో ఏమైనా పరిష్కారం పెద్దన్నగా బీజేపీ సూచిస్తే బాగుంటుంది అని అంటున్న వారూ ఉన్నారు. ఇక ఇక్కడ ఈ ప్రతిపాదన నిజమో కాదో తెలియదు కానీ చేసిన వారి ఆలోచనల నుంచి చూస్తే అది ఏ మాత్రం వర్కౌట్ అవ్దదనే అంటున్నారు. ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేయాలి. ఆ మీదట ఆయన సీఎం కావాలి. అలా కాకుండా పవన్ ని ఎంపీగా కేంద్రంలోకి పంపిస్తే మాత్రం కాపులు పూర్తిగా కూటమికి దూరం అవుతారు అని అంటున్నారు.

ఏది ఏమైనా కూటమి సక్సెస్ నూరు శాతం కావాలంటే అందరూ గెలిచేలా విధానం ఉండాలని అంటున్నారు. అయితే పవన్ ఎంపీగా అన్నది బీజేపీ నేతలు నిజంగా చెప్పారా లేక వేరే విధంగా అది గాసిప్ గా వచ్చిందా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు. ఆరు నూరు అయినా పవన్ అసెంబ్లీకే పోటీ చేస్తారు అని అంటున్న వారూ ఉన్నారు. ఆయన కనుక కేంద్రంలో మంత్రి కావాలంటే బీజేపీతో కలసి రాజ్యసభ అందుకుని ఏనాడో అయ్యేవారు అని చెబుతున్న వారూ ఉన్నారు మొత్తానికి చూస్తే కూటమి మీద పొత్తుల మీద ఎన్ని రకాలైన ప్రచారాలు ఇంకా ముందు వస్తాయో చూడాల్సిందే అంటున్నారు.