పవన్ కల్యాణ్ వీక్ నెస్.... అతనే విప్పాడా?
పవన్ కి ఏ విషయం నలుగురిలో మాట్లాడాలో.. ఏ విషయం నాలుగు గోడల మధ్య మాట్లాడాలో తెలియదనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటాయి
By: Tupaki Desk | 29 Feb 2024 5:54 AM GMTపవన్ కి ఏ విషయం నలుగురిలో మాట్లాడాలో.. ఏ విషయం నాలుగు గోడల మధ్య మాట్లాడాలో తెలియదనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఫిర్యాదు చాలా మంది టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద పలుమార్లు ప్రస్థావించారని చెబుతుంటారు. ఇదే ఫిర్యాదు జనసేన నేతల నుంచీ వినిపిస్తుంటుంది! "మీటింగ్ అయితే మంగళగిరి ఆఫీసులో నాలుగు గోడల మధ్య పెడతారు కానీ.. అది లైవ్ వస్తుందనే విషయం మావాడు మరిచిపోతాడేమోనండీ.." అని జనసైనికులు పలుమార్పు కామెంట్ చేశారని చాలామంది చెబుతారు!
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... తాజాగా తాడేపల్లిలో టీడీపీ - జనసేన కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి బహిరంగ సభ "జెండా"లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. వాటిని టీడీపీ అనుకూల మీడియాగా పేరున్న పలు మీడియా సంస్థలు హైలెట్ చేసిన విషయాలు.. దీనిపై ఇంటా బయటా జరుగుతున్న చర్చ.. వినిపిస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా... జనసేనకు ఓట్లు వేయించే నేతలు లేరు అనే కీలక విషయం పవన్ పబ్లిక్ గా చెప్పేశారు.
అవును... సాధారణంగా రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికీ కొన్ని బలాలు, బలహీనతలూ ఉండటం సహజం. అన్నీ బలాలే ఉండవు.. అలా అని కనిపించనివన్నీ బలహీనతలు అనుకోవాల్సిన అవసరమూ లేదు. అయితే... ఆ పార్టీని నడిపించే నాయకుడు అనేవాడు మాత్రం ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ, కేడర్ ని కలుపుకుంటూ, వారిలో బలహీనత గురించిన చర్చ జరగకుండా జాగ్రత్తపడుతూ, అందరినీ కలుపుకుపోవాలి.
అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం ఆ విషయంలో కాస్త వీక్ అనుకోవాలో.. లేక, అతని టైపు రాజకీయం అంతే అని భావించాలో తెలియదు కానీ... తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం జనసైనికులను, ఆ పార్టీ నేతలను, కాపు సామాజికవర్గ నేతలను పూర్తిగా నిరాశలోకి నెట్టేసిందనే చెప్పాలి. ప్రధానంగా 24 సీట్లు మాత్రమే ఎందుకు అనే విషయాన్ని సమర్ధించుకునే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇందులో భాగంగా.. "పోల్ మేనేజ్మెంట్ తెలుసా..? ఆర్గనైజేషన్ బలం ఉందా..? సంస్థాగతంగా పాతుకుపోయిన టీడీపీ వంటి పార్టీలతో మనం పోటీపడగలమా..? 800 నుంచి వెయ్యిమంది బూత్ లెవెల్ కార్యకర్తలు మనకు ఉన్నారా..? వారిని ఎంతో కొంత డబ్బులిల్స్తు, భోజనాలు పెట్టే సత్త మన నాయకత్వానికి ఉందా..?" అంటూ పవన్ చేసిన ప్రసంగంపై సొంతపార్టీ నేతలే ఫైరవుతున్నారు. ప్రతీ పార్టీకి కొన్ని బలహీనతలు ఉంటాయి.. అలాగే జనసేనకూ ఉండి ఉండొచ్చు.. అంతమాత్రాన్న ఆ విషయాలను బహిరంగ వేదికలపై ప్రస్థావిస్తారా..? అంటూ జనసైనికులు విరుచుకు పడిపోతున్నారు.
ఇంత బహిరంగంగా పైన చెప్పిన క్వాలిటీస్, టీడీపీకి ఉన్న అర్హతలు జనసేనకు లేవని ఓపెన్ గా చెబితే అది కచ్చితంగా అధ్యక్షుడి వైఫల్యమే కదా అనేది ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. మరి 10 ఏళ్లుగా అక్కడ పడ్డాను, ఇక్కడ లేచాను అని చెబుతున్న పవన్ కల్యాణ్.. ఇంతకాలం పార్టీని ఏమి ఉద్దరించినట్లు? అనే ప్రశ్నలు కూడా తదనుగునంగా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రసంగాన్ని 24 సీట్లేనా అని అంటున్న కాపులు, జనసైనికులకు టీడీపీ కేడర్ షేర్ చేస్తున్నారని అంటున్నారు!
ఇన్ని చెప్పిన పవన్ కల్యాణ్... వాటన్నింటికీ తానే కారణం అని మాత్రం అంగీకరించకుండా... 2019లో తనను గెలిపించని ఓటర్లను, ఆ దిశగా ప్రయత్నం చేయలేదని జనసైనికులను దెప్పిపొడుతున్నారు. వాస్తవానికి 2019లో జనసేన సింగిల్ సీటు గెలిచుకున్నప్పటికీ.. పవన్ రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ.. ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లు సాధించింది. పైగా తాము ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తామని ఇటీవలే పవన్ కల్యాణ్ చేప్పుకున్నారు.
అంటే.. అవన్నీ బ్లఫ్ మాటలు, డబ్బా కబుర్లా..? కాకపోతే... ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది..? 2019 ఎన్నికల తర్వాత పవన్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు.. నాదేండ్ల మనోహర్ తప్ప పార్టీలో మరో నాయకుడిని ఎదగనివ్వలేదు.. సినిమాల ప్రభావమో, లేక, ఆత్మనూన్యతా భావమో తెలియదు కాని... అంతా తానే, అన్నీ తానే... తాను హీరో, నాదేండ్ల డైరెక్టర్, చంద్రబాబు నిర్మాత అన్నట్లుగా సాగిపోయారనే కామెంట్లు బలంగా వినిపించడానికి కారకులయ్యారు.
సరే అవసరం ఎవరిదైనా.. అవకాశం మరెవరిదైనా.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ 24 సీట్లతో సరిపెట్టుకున్నారు. పైగా ఆ సీట్లలో నాదేండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ వంటి నేతలను పోటీకి దింపుతున్నారు. మరి నిజంగా తల తాకట్టు పెట్టి, భవిష్యత్తును పక్కనపెట్టి జనసేన కోసం కష్టపడిన వారికి దక్కిన సీట్లెన్ని? అవమాన పడాల్సింది పవన్... ఆయన చెప్పిన లోపాలన్నింటికీ కారణం పవన్... అది మరిచి, తన అసహాయతను జనసైనికులపై నెట్టడం ఏమిటి..?