సీఎం జగన్ పై రాళ్ల దాడిపై పవన్ కొత్త డిమాండ్ విన్నారా?
ఈ దాడి వెనుక విపక్ష నేతలు ఉన్నట్లుగా అధికార పక్షం ఆరోపిస్తే.. అధికారపక్షమే ఇదంతా చేసుకుందన్నట్లుగా విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే
By: Tupaki Desk | 16 April 2024 4:47 AM GMTఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన ఉదంతంపై ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తనదైనరీతిలో మరో డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. విజయవాడలో నిర్వహించిన బస్సు యాత్ర (మేమంతా సిద్ధం)లో భాగంగా జగన్ పైకి రాయి విసరటం.. నుదిటి మీద తగలటం.. దీనికి రెండు కుట్లతో చికిత్స చేయటం తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ దాడి వెనుక విపక్ష నేతలు ఉన్నట్లుగా అధికార పక్షం ఆరోపిస్తే.. అధికారపక్షమే ఇదంతా చేసుకుందన్నట్లుగా విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ దాడి ఘటనపై ఏపీ పోలీసులు చేస్తున్న విచారణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నో చెప్పటానికి సరైన కారణం ఉందన్నది ఆయన మాట. అదేమంటే.. సీఎం జగన్ పై దాడి ఉదంతంలో బాధ్యత వహించాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు.
డీజీపీ.. నిఘా విభాగం అధిపతి.. విజయవాడ పోలీస్ కమిషనర్.. ముఖ్యమంత్రి సెప్యూరిీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలని కోరారు. భద్రతా లోపాలతోనే దాడి జరిగిందన్న వాదనను వినిపిస్తున్న పవన్ కల్యాణ్.. ముందుగా వారిని బదిలీ చేయాలని.. నిజాయితీ అధికారులతో విచారణ జరపాలని ఆయన కోరుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పవన్ కల్యాణ్.. ‘‘వీవీఐపీ కేటగిరీలో ముఖ్యమంత్రి జగన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా పరదాలు కట్టి. .చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు. మరి.. ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ నిలిపివేసి చీకట్లో బస్సు యాత్ర నిర్వహించారు’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆ మధ్యన ప్రధానమంత్రి మోడీ సభలోనూ సెక్యూరిటీ పరమైన లోపాలు తలెత్తాయని.. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి పర్యటనకు వచ్చినా ఇంతే స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తారని ఫైర్ అయ్యారు. ఇలాంటి అధికారులతో ఎన్నికల్ని పారదర్శకంగా ఎలా నిర్వహిస్తారంటూ జనసేనాని నిలదీస్తున్నారు. మరి.. జనసేనాని సందేహాలకు సమాధానాలు చెప్పేవారెవరు? అన్నది అసలు ప్రశ్న.