Begin typing your search above and press return to search.

గోదావరి తీరంలో జనసేన సంగతేంటి ..!?

గోదావరి జిల్లాలు జనసేనకు కీలక రాజకీయ స్థావరాలు. 2019లో జనసేనకు ఎక్కువగా ఓట్లు ఇచ్చిన జిల్లాలు

By:  Tupaki Desk   |   20 April 2024 3:46 AM GMT
గోదావరి తీరంలో జనసేన సంగతేంటి ..!?
X

గోదావరి జిల్లాలు జనసేనకు కీలక రాజకీయ స్థావరాలు. 2019లో జనసేనకు ఎక్కువగా ఓట్లు ఇచ్చిన జిల్లాలు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా ఎంతో కొంత చూపించిన ప్రాంతాలు కూడా ఇవే. ఈ జిల్లాలను చూసుకునే జనసేన తన రాజకీయాలను ధీమాగా చేసింది.

ఆ వ్యూహం కూడా కరెక్ట్ అన్నది కూడా అపుడు గట్టిగా వినిపించిన మాట. ఎందుకంటే కేవలం రెండు మూడు జిల్లాలను చేతిలో ఉంచుకుని కర్నాటకలో కుమారస్వామి పార్టీ జేడీఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని రెండు సార్లు అందుకుంది. ఏపీలో కూడా పవన్ కింగ్ మేకర్ గా 2024లో ఉంటారు అని కూడా భావించారు.

తీరా చూస్తే సీట్ల బేరం నుంచి అభ్యర్ధులను ఎంపిక చేసిన తీరు దాకా చూస్తే జనసేన రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పులు చేసింది అని అంటున్నారు. ఫలితంగా జనసేనకు పట్టుకొమ్మల్లాంటి గోదావరి జిల్లాలలో బలం తగ్గిపోయింది అని అంటున్నారు.

జనసేన కోసం పనిచేసిన వారు అంతా ఇష్టం ఉన్నా లేకపోయినా వైసీపీలో చేరుతున్నారు. వైసీపీ సైతం వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుంటోంది. ఏకంగా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జులు కూడా జనసేనకు గుడ్ బై కొట్టేస్తున్న నేపధ్యం కనిపిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర గోదావరి జిల్లాలలో సాగిన తీరు జనాలు స్పందించిన తీరుని చూసిన మీదట వైసీపీ బలం బాగా పెరిగింది అని అంటున్నారు. నిజానికి కూటమి కట్టాక గోదావరి జిల్లాలలో ఫ్యాన్ తిరగనే కూడదు. కానీ అందుకు భిన్నంగా జగన్ బస్సు యాత్ర సాగింది.

వచ్చిన వారా తెచ్చిన వారా అని చూస్తే కనుక రెండు రకాలైన జనాలూ ఉన్నారు. అలా వచ్చిన వారు సైతం ఎండలలో నిలబడి జగన్ కోసం వేచి ఉండడం కూడా వైసీపీ పెరిగిన గ్రాఫ్ ని తెలియచేస్తోంది అని అంటున్నారు. ఇవే గోదావరి జిల్లాలలో గత ఏడాది జూలై ఆగస్ట్ నెలలలో చూస్తే జనసేన ఊపే వేరుగా ఉండేది. ఆ సమయంలో వైసీపీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉండేది.

కానీ ఇపుడు గోదావరి జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే కనీసంగా పద్దెనిమిది సీట్ల దాకా వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రానున్న రోజులలలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది అని అంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాక వైసీపీ వైపు జనాలు పూర్తిగా టర్న్ అవుతారు అని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఇంకో వైపు చూస్తే టీడీపీ సోలోగా పోటీ చేస్తే ఈసారి విజయావకాశాలు బాగా ఉండేవన్న చర్చ కూడా ఆ పార్టీలోనూ బయటా సాగుతోంది. కూటమి కట్టి టీడీపీ నష్టపోతోందని అంటున్నారు. ఇక టీడీపీ వ్యూహకర్తలు సైతం పొత్తు వల్ల ఇబ్బందులే అని చెబుతున్నారు అంటున్నారు.

గత ఏడాదికీ ఇప్పటికీ జనసేన గోదావరి జిల్లాలలో బలహీనపడింది అని అంటున్నారు. అలాగే ఓట్ల బదిలీ జరగదని, పొత్తులు గుదిబండగా మారిన నేపధ్యంలో కూటమి ఆశలు నెరవేరుతాయా లేదా అన్న డౌట్లు వస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందో.