Begin typing your search above and press return to search.

పవన్ అను నేను...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి అవుతారు

By:  Tupaki Desk   |   16 May 2024 1:30 AM GMT
పవన్ అను నేను...!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి అవుతారు. ఆయన ఏ శాఖ తీసుకుంటారు అన్న చర్చ మాత్రం అంతటా సాగుతోంది. పవన్ తరచూ మీటింగులలో చెప్పే మాటలను చూసిన వారు ఆయన హోం శాఖ తీసుకుంటారు అని అంటూంటారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య వంటి పెద్దలు అయితే పవన్ ని హోం మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిని చేసి గౌరవించాలని సూచించారు.

అయితే పవన్ కి సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారు అని మరో ప్రచారం కూడా ఉంది. ఏపీలో టీడీపీ కూటమి ఏర్పడితే సినీ రంగానికి ప్రభుత్వానికి మధ్య వారధిగా పవన్ ఉంటారు అన్న ఉద్దేశ్యంతో అలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించవచ్చు అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ మనసులో ఒక అతి ముఖ్యమైన శాఖ మీద మోజు ఉందని అంటున్నారు. ఆయన జలవనరుల శాఖ మంత్రి కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇది కూడా ప్రచారంగా ఉన్నా పవన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనకు మోజు ఉందని లెక్క వేస్తున్నారు. అలా చూసుకుంటే కనుక పవన్ చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి అవుతారు అని అంటున్నారు.

పవన్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ నుంచే ఆయన ఏపీలో కాలువలకు పూడికలు తీయాలని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది అని పేర్కొన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి పూడికలు తీయిస్తే పుష్కలంగా పడే వాన నీరుతో కాలువలు నిండుతాయని ఆయన అన్నారు.

ఇక పవన్ సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేళ ఆయనకి నివాళులు అర్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి తీరం పచ్చటి మాగాణంగా కళకళలాడుతోంది అంటే సర్ ఆర్థర్ కాటన్ మహనీయుడు అకుంఠిత దీక్షతో ఆనకట్ట నిర్మాణం చేపట్టడంతోనే అని పవన్ అన్నారు.

అంతే కాదు సాగు నీటి కాలువలు తవ్వించడమేనని అందుకే గోదావరి డెల్టా ప్రజలు నేటికీ గోదావరి పుణ్య స్నానం ఆచరించే టప్పుడు కాటన్ ను తలచుకొని ప్రణామాలు అర్పిస్తారని ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేసేవారిని తరతరాలు తలచుకొంటాయని చెప్పడానికి కాటన్ జీవితమే తార్కాణం అని ఆయన అన్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాలువల నిర్మాణంలో బ్రిటిష్ పాలకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని అధిగమించి అనుమతులు పొంది నిర్మాణాలను పూర్తి చేశారు. గోదావరి డెల్టాలోనే కాదు కృష్ణా, తుంగభద్ర తీరాల్లోనూ కాటన్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయని పవన్ గుర్తు చేశారు. జల వనరుల ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ విషయంలో పాలకులు, అధికారులు, ఇంజినీర్లు సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తిని అందుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు

ఇక ఎన్నికల సభలలో పవన్ పోలవరం ప్రాజెక్ట్ గురించి పదే పదే ప్రస్తావించారు. అంతే కాకుండా ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చేయాల్సినదేంటో ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ప్రత్యేకంగా పోలవరం సెస్ ని విధించి మరీ సకాలంలో ప్రాజెక్ట్ ని పూర్తి చేసేలా తాను చర్యలు తీసుకుంటాను అని ఆయన ఏపీ ప్రజలకు మాట ఇచ్చారు.

ఇవన్నీ చూస్తూంటే పవన్ కళ్యాణ్ ని జల వనరుల శాఖ మీద అమితమిన ప్రేమ కనిపిస్తోంది అని అంటున్నారు. అంతే కదు పవన్ ఈ శాఖను తీసుకోవడం వెనక లక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పరిపూర్తికి కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద తనకు ఉన్న పలుకుబడి సాన్నిహిత్యంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అని అంటున్నారు.

ఆ విధంగా వందేళ్ళ నాటి పోలవరం కలను పూర్తి చేయడం అంటే పవన్ కూడా తన పేరుని సార్ధకం చేసుకోవడమే అంటున్నారు. అందుకే ఆయన ఈ శాఖ మీద ఆసక్తి చూపుతున్నారు అని అంటున్నారు. ఈ శాఖ పవన్ కి ఇచ్చేందుకు చంద్రబాబుకు కూడా అభ్యంతరాలు ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ ఈసారి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నారు.