Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీకి 20 కూడా వచ్చేవి కాదా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లిష్టమైన దశలో టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్లారు

By:  Tupaki Desk   |   18 May 2024 2:30 AM GMT
పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీకి 20 కూడా వచ్చేవి కాదా ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లిష్టమైన దశలో టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్లారు. టీడీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో ఉన్న వేళ పవన్ ఏకంగా జైలులోకి వెళ్ళి మరీ బాబుని పరామర్శించి వచ్చారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీడీపీ జనసేన ఒక్కటిగా ముందుకు సాగుతాయని ఆయన సంచలన ప్రకటన అక్కడే అపుడే చేశారు.

అలా పవన్ టీడీపీకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ ని వెలకట్టడానికి తూకం వేయడానికి కూడా ఏ ఒక్కటీ సరిపోదు అనే అంతా అంటారు. అది మొదలుగా టీడీపీకి లెక్కలేని బలం వచ్చింది. ఎంతో ఊపు కూడా కనిపించింది. పవన్ అనే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత, క్రౌడ్ పుల్లర్, ఫుల్ గ్లామర్ ఉన్న నేత టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడడంతో గత ఏడాది అక్టోబర్ నుంచే టీడీపీ జోరు వేరే లెవెల్ లోకి వెళ్ళిపోయింది అన్నది ఒక విశ్లేషణ.

ఇక ఈసారి ఎన్నికలను అంతా చూశారు. టీడీపీ జనసేనతో జట్టు కట్టింది. బీజేపీని తమతో కలుపుకుంది. వైసీపీ అనుకూల ఓట్లను షర్మిల ద్వారా చీల్చే ప్రయత్నం చేసింది. కామ్రేడ్స్ బయట ఉన్న బాబు క్షేమం కోరుకునేవారుగా చేసుకుంది. ఎన్నారైలను దగ్గరకు తీసుకుంది. వ్యతిరేక ఓట్లు పొల్లుపోకుండా చూసుకుంది. ఇంత చేసినా వైసీపీతో హోరా హోరీ పోరు అన్నది పోలింగ్ అనంతరం నివేదికలు చెబుతున్నారు. ఈ రోజుకీ వైసీపీకి గెలిచే చాన్స్ ఉంది అనే సర్వేలూ వస్తున్నాయి.

దీనిని బట్టి చూస్తే కనుక అసలు టీడీపీ ఒంటరి పోరాటం చేసి ఉంటే ఈసారి ఎన్నికల్లో ఏమిటి పరిస్థితి అన్న చర్చ కచ్చితంగా అందరిలోనూ వస్తుంది. పవన్ మద్దతు లేకుండా ఉంటే కనుక టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు అని తలపండిన రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.

ఇక టీడీపీ పాలనలో చెప్పుకునేందుకు ఏదే లేదు అన్నది కూడా లేదు అంటున్నారు. జగన్ ఎన్నికల సభలలో ప్రశ్నించినట్లుగా తన పద్నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన ఒక్క మైలు రాయి లాంటి పని ఏమైనా ఉందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రూపంలో గట్టి అండ టీడీపీకి దొరికింది అని అంటున్నారు.

అదెలా అంటే 18 శాతం ఉన్న కాపులు, తూర్పు కాపులు, బలిజలు అంతా కూడా టీడీపీ కూటమి గొడుగు కిందకు వచ్చారు. దీంతో టీడీపీకి వీరంతా అనుకూలంగా మారి బలమైన ఓటు బ్యాంక్ గా తయారు అయ్యారు అని అంటున్నారు. మొదట్లో కాపులు అంతా పవన్ మీద కాస్తా కోపం ప్రదర్శించారు అన్నది నిజం. ఎందుకంటే వారికి కేవలం 21 సీట్లు మాత్రమే టీడీపీ ఇచ్చిందని దాన్ని పవన్ పుచ్చేసుకున్నారు అని.

అయితే జగన్ పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడంతో కాపులు అంతా వైసీపీకి వ్యతిరేకంగా మారారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడ్డారు అన్నది ఒక విశ్లేషణ గా ఉంది. ఇక టీడీపీకి చాలా కాలంగా వస్తున్న సంప్రదాయ మద్దతుదారు అయిన బీసీలలో కొంత ఓటు బ్యాంక్ వైసీపీకి టర్న్ అయిన వేళ ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి కాపులు కూటమి వైపు రావడం నిజంగా కలసి వచ్చిన పరిణామంగా అంతా చూస్తున్నారు.

ఈ మొత్తం సమీకరణలు సామాజిక లెక్కలు రాజకీయ అంశాలు బేరీజు వేసుకున్నపుడు పవన్ మద్దతు లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఏ 20 సీట్ల దగ్గరో ఆగిపోయేది అని అంతా అంటున్న మాటగా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి రేసులో ఉంది అని అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు వల్ల వ్యవస్థలలో పూర్తి సానుకూలతను సాధించుకున్న కూటమి వైసీపీకి ఆ విధంగా గట్టి పోటీని ఇవ్వగలిగింది అని అంటున్నారు.

అందుకే బీజేపీని కూడా చంద్రబాబు దగ్గరకు తీశారు అని అంటున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చినా కూడా బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ సీట్లు బాబు ఇవ్వడం వెనక వ్యవస్థలను ఎన్నికల సమయంలో సానుకూలం చేసుకుని ఎలక్షనీరింగ్ లో పై చేయి సాధించే ఉద్దేశ్యమే అని అంటున్నారు. ఇలా అన్ని వ్యూహాలు అనుకున్నట్లుగా విజయవంతం కావడంతో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను టీడీపీ వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు. మొత్తంగా పవన్ బలం అన్నది టీడీపీకి కొండంత అండ అన్నది నిఖార్సు అయిన విశ్లేషణగా అంతా చూస్తున్నారు.